Sleeping Pods: రైల్వే ప్రయాణికులను ప్రధానంగా వెంటాడే సమస్యల్లో వెయిటింగ్ ఒకటి. రైలు ఆలస్యం కావడం లేదా కనెక్టివిటీ రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికులు ప్రధానంగా ఇబ్బందులు పడుతుంటారు. చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి గంటల తరపడి స్టేషన్ లోని సీటింగ్ బల్లపై కుర్చుండిపోతుంటారు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే శాఖ.. స్టేషన్ లోనే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం స్లీపింగ్ పాడ్ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా గుంటూరు రైల్వే స్టేషన్ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్లీపింగ్ పాడ్స్ అంటే ఏంటి?
రైళ్లు, బస్సుల్లో కనిపించే స్లీపర్ బెర్త్ తరహాలో పరిమిత ప్లేసులో బెడ్ సౌకర్యాన్ని కల్పించడాన్ని ‘స్లీపింగ్ పాడ్స్’గా చెబుతుంటారు. ఇవి తక్కువ స్పేస్ లో ఉండి ప్రయాణికులు సేదతీరేందుకు ఉపయోగపడుతుంటాయి. ఈ తరహా స్లీపింగ్ పాడ్స్ విమానశ్రయాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ కూడా పలు స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ పాడ్స్ ను ప్రారంభించారు.
గుంటూరులో 64 పడకలతో..
గుంటూరు రైల్వే స్టేషన్ లో మెుత్తం 64 పడకలతో ఈ స్లీపింగ్ పాడ్స్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేషన్ లోని 1, 3వ నెంబర్ ప్లాట్ ఫామ్స్ లో వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో సింగిల్, డబుల్ అక్యూపెన్సీ బెడ్స్ ఉన్నాయి. రాత్రి వేళ ప్రయాణం చేసేవారికి, కనెక్టింగ్ రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ఈ బెడ్స్ చాలా ఉపయోగరంగా ఉండనున్నాయి.
ధర ఎంతంటే?
రైల్వే స్టేషన్ల బయట ఉండే హోటల్స్, లాడ్జీలు, అతిథి గృహాలతో పోలిస్తే.. స్పీపింగ్ పాడ్స్ లో బస చాలా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది. సింగిల్ పాడ్ 3 గంటలకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటలు కావాలంటే రూ.500 ఛార్జ్ చేస్తారు. డబుల్ బెడ్స్ కావాలంటే 3 గంటలకు రూ.250 వసూలు చేస్తారు. 24 గంటలకైతే రూ.500 తీసుకుంటారు. మరోవైపు స్లీపర్ పాడ్స్ తో పాటు సెపరేట్ గదులు సైతం ఫ్యామిలీ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి కావాలంటే 3 గంటలకు రూ.300, 24 గంటలకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ గదిలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలతో సౌకర్యవంతంగా ఉండొచ్చు.
ఫ్రీ వై-ఫై, ఏసీ
ఈ స్లీపింగ్ పాడ్స్ లో ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏసీ బెడ్స్, దిండు దుప్పటితో పాటు ఫ్రీ వైఫై, ఛార్జింగ్ పాయింట్స్, వాష్ రూమ్స్, స్నానానికి వేడి నీరు కూడా అందుబాటులో ఉంచారు. ఉద్యోగుల కోసం వర్క్ డెస్క్ ను సైతం ఏర్పాటు చేశారు.
Also Read: Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన
విశాఖ, హైదరాబాద్ లోనూ..
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రైల్వే స్టేషన్ లోనూ ఈ స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. నాన్ ఫేర్ రెవెన్యూ మోడల్ కింద.. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్లలో వీటిని రైల్వే శాఖ ప్రారంభించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఈ సేవలను వినియోగించుకున్నారు. అయితే దేశంలో బాగా రద్దీగా ఉండే మరిన్నీ రైల్వే స్టేషన్లలో ఈ స్లీపింగ్ పాడ్ సేవలను విస్తరించాలని రైల్వే శాఖ భావిస్తోంది.

