Vande Bharat 4.0: దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే (Indian Railway).. రోజు రోజుకు విఫ్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంది. ప్రయాణికులను అత్యంత వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తూ మౌలిక సదుపాయాలను కేంద్రం మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో వందే భారత్ రైలు 4.0 వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది.
వందే భారత్ 4.0 ప్రత్యేకత
భారతీయ రైల్వే చరిత్రలో అడ్వాన్స్డ్ వెర్షన్ రైలుగా వందే భారత్ 4.0 రాబోతోంది. దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు ఇదే కానుండటం విశేషం. 2027లో దీనిని పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్ – ముంబయి బుల్లెట్ రైలు మార్గంలో దీనిని పరుగులు పెట్టించాలని కేంద్రం భావిస్తోంది.
గరిష్ట వేగం ఎంతంటే?
రాబోయే వందే భారత్ 4.0 రైలు.. గంటకు 250 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రారంభ దశలో ఈ వేగం కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. గంటకు 180 కి.మీ వేగంతో పరుగులు పెట్టే అవకాశముందని ఓ నివేదిక పేర్కొంది. కాగా, గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించగల రైల్వే కారిడార్ లో ఈ రైలు చక్కర్లు కొట్టనుండటంతో భవిష్యత్తులో దీని వేగం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది.
భద్రతా ఏర్పాట్లు..
వందే భారత్ 4.0 రైలును అధునాతన కవచ్ 5.0 (KAVACH 5.0) భద్రతా వ్యవస్థతో రూపొందిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తోడ్పడే మెరుగైన ఫైర్ సేఫ్టీ టెక్నాలజీ (Fire Safety Technology) సైతం ఇందులో అమరుస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు ప్రస్తుత వందే భారత్ రైళ్లతో పోలిస్తే కొత్త సస్పెన్షన్ సిస్టం, తక్కువ వైబ్రేషన్స్, తేలికపాటి శబ్దం ఇందులో ప్రత్యేక ఫీచర్లుగా ఉండనున్నాయి.
Also Read: Rayalaseema Project: రేవంత్ గిఫ్టు కోసం.. రాయలసీమ లిఫ్టు తాకట్టు.. చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఫైర్!
లగ్జరీ కోచ్ డిజైన్..
వందే భారత్ అధునాతన వెర్షన్ లో కోచ్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉండనుంది. ఎర్గోనామిక్ సీట్లు, విశాలమైన లెగ్ స్పేస్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, వై-ఫైతో పాటు ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్లు, జీపీఎస్ ఆధారిత ట్రావెల్ సమాచారం. బయో వాక్యూమ్ టాయిలెట్లు, వాతావరణానికి అనుగుణంగా పనిచేసే స్మార్ట్ HVAC సిస్టమ్ వంటి ఫీచర్లను ఈ రైలు కలిగి ఉండనున్నట్లు సమాచారం.

