Rayalaseema Project: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కేంద్రంగా ఏపీలో అధికార టీడీపీ (TDP), విపక్ష వైసీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) సైతం చంద్రబాబు (CM Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకొని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన గోరంట్ల మాధవ్.. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డితో కుమ్మక్కై..
పోలవరం ప్రాజెక్టును సైతం సీఎం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే గతంలో చెప్పారని గోరంట్ల మాధవ్ గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడటం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేశారని విమర్శంచారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్టును తానే ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని గోరంట్ల మాధవ్ అన్నారు.
సీఎంల మధ్య రహాస్య ఒప్పందం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడంపై నిజనిర్ధారణకు కూడా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని గోరంట్ల మాధవ్ అన్నారు. ఏపీ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య ఒప్పందం ఏమిటో చంద్రబాబు ఏపీ ప్రజల ముందు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ (YS Jagan)కి మంచి పేరు రావడం ఓర్వలేకనే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని ఆరోపించారు.
Also Read: Secunderabad Issue: వచ్చేది మేమే.. సికింద్రాబాద్‌ను జిల్లా చేస్తాం.. కేటీఆర్ కీలక ప్రకటన
వైసీపీ నేతలపై అక్రమ కేసులు..
మరోవైపు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారని గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. చిన్నారిని చంపేసి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు మృతదేహాన్ని గుర్తించి నిందితులను శిక్షించలేకపోయిందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని గోరంట్ల మాధవ్ సూచించారు.

