Hydrogen Train: దేశంలో మెుట్ట మెుదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. హరియాణా (Haryana)లోని జింద్ – సోనిపట్ (Jind–Sonipat) ప్రాంతాల మధ్య ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెలలోనే ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ట్రయల్ రన్ మెుదలయ్యే అవకాశముందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు పూర్తి
రైల్వేలను సైతం పర్యావరణ హితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకొస్తుంది. భారతీయ రైల్వే (Indian Railway)తో పాటు రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ (RDSO), స్పానిష్ భాగస్వామ్య కంపెనీ గ్రీన్ హెచ్ (Green H) సంయుక్తంగా ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశాయి. జింద్ – సోనిపట్ నగరాల మధ్య ట్రయల్ రన్ (Trail Run)కు అవసరమైన ఏర్పాట్లను సైతం అవి పూర్తి చేశాయి.
India’s 1st Hydrogen fuelled Train starts trial run today on #Jind #Sonipat line
RDSO IS CONDUCTING OSCILLATION & EBD TRIALS#India is now 5th country globally with #HydrogenTrain after Germany, Sweden, Japan & China.
A big step for clean & green Rail Travel#IndianRailways pic.twitter.com/oaf3tqJzA9
— Ansuman Satapathy (@TechAnsuman) January 6, 2026
హైడ్రోజన్ శక్తితో పరుగులు..
హైడ్రోజన్ రైలులో మెుత్తం 8 ప్యాసింజర్ కోచ్ లు ఉండనున్నాయి. ముందు వెనుక భాగం కలిపి రెండు ఇంజిన్స్ ఉంటాయి. ఈ రైలు ఎలక్ట్రోకెమికల్ టెక్నాలజీ (Electrochemical Technology) ఆధారంగా హైడ్రోజన్ శక్తితో పరుగులు పెట్టనుంది. గంటకు 150 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈ రైలు ప్రయాణించగలదు. రైలుకు ఇంధనం అందించడానికి జింద్ లో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేశారు. 3000 కిలో గ్రాముల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ కు 11KV విద్యుత్ ను సరఫరా చేయనున్నారు. తద్వారా హైడ్రోజన్ రైలుకు నిరంతరాయంగా ఇంధనాన్ని అందించేందుకు వీలు ఏర్పడనుంది.
9 లీటర్ల నీటితో కి.మీ ప్రయాణం
రైలుకు కావాల్సిన హైడ్రోజన్ శక్తిని నీటి నుంచే ఉత్పత్తి చేయనున్నారు. 9 లీటర్ల నీటి నుంచి 900 గ్రాముల హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ శక్తితో హైడ్రోజన్ రైలు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించగలదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. జింద్ లోని ప్లాంట్ లో 3000 కిలోల హైడ్రోజన్ తో పాటు 7,680 కిలోల ఆక్సిజన్ ను సైతం నిల్వ చేయవచ్చని పేర్కొంటున్నాయి. స్పానిష్ నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతికతతో ఈ ప్లాంట్ నడవనున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ కు గంటకు 40 వేల లీటర్ల నీరు అవసరం అవుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే స్టేషన్ పైకప్పు నుంచి కూడా వర్షపు నీటిని సేకరించేలా ప్లాంట్ లో ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశాయి.
Also Read: TG High Court: ‘భార్య వంట చేయడం లేదని ఫిర్యాదు’.. తెలంగాణ హైకోర్టు షాకింగ్ కామెంట్స్
టికెట్ ధర ఎంతంటే?
తొలి హైడ్రోజన్ రైలు సోనిపట్ – జింద్ ప్రాంతాల మధ్య ప్రయాణించనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 90 కి.మీ కాగా.. గంటలోపే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకోనుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున ట్రయల్ సమయంలో గంటకు 110-140 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. సాధారణంగా సోనిపట్ – జింద్ ప్రాంతాల మధ్య తిరిగే డీజిల్ రైళ్లు గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపు 2 గంటల పట్టనుండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ మార్గంలో మెుత్తం ఆరు స్టేషన్లు ఉండనుండగా ప్రయాణికుడు దిగే స్టేషన్ ను బట్టి టికెట్ ధర ఉండే అవకాశముంది. దీని ప్రకారం రూ.5-25 మధ్య టికెట్ ధర ఉంటుందని అంచనా. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలించవచ్చని తెలుస్తోంది.

