Indian Railways: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాడ్-గేజ్ రైలు మార్గాల్లో 99.2 శాతం విద్యుదీకరణ పూర్తయింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ 100శాతం విద్యుదీకరణతో టాప్ లో ఉండగా దాని తర్వాతి స్థానంలో భారతీయ రైల్వే నిలవడం విశేషం. అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనా కూడా రైల్వే విద్యుదీకరణ (82%)లో భారత్ కంటే వెనుకబడే ఉండటం గమనార్హం. చైనా తర్వాత స్పెయిన్ 67%, జపాన్ 64%, ఫ్రాన్స్ 60%, రష్యా 52% రైళ్ల విద్యుదీకరణలో ముందున్నాయి.
25 రాష్ట్రాల్లో 100% విద్యుదీకరణ
భారతీయ రైల్వే విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 నవంబర్ నాటికి దేశంలో 69,427 RKM (రూట్ కిలోమీటర్లు) విద్యుదీకరించబడ్డాయి. వీటిలో 2014 – 2025 మధ్య కాలంలోనే 46,900 RKM మేర విద్యుదీకరణ జరిగింది. 2004-2014 కాలంలో రోజుకు 1.14 కి.మీ మాత్రమే విద్యుదీకరణ పనులు జరగ్గా.. 2014-2025 మధ్య అది 15 కి.మీలకు పైగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని 25 రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ 100 శాతం విద్యుదీకరించబడినట్లు నవంబర్ నివేదిక పేర్కొంది. రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, అసోం, గోవా రాష్ట్రాల్లో మాత్రమే అక్కడక్కడ విద్యుదీకరణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. 574 RKM లేదా 0.8 శాతం పనులు కూడా పూర్తైతే భారతీయ రైల్వే నెట్ వర్క్ 100 శాతం విద్యుదీకరణ కానుంది.
1925 తొలిసారి ప్రారంభం..
భారతీయ రైల్వే విద్యుదీకరణ పనులు 1925 ముంబయిలో తొలిసారి ప్రారంభమైంది. మెుదటి ఎలక్ట్రిక్ రైలు బాంబే విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ మధ్య 1500వోల్ట్ DC వ్యవస్థతో నడిచింది. స్వాతంత్రానికి ముందు వరకూ కూడా 388 రూట్ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. స్వాతంత్ర అనంతరం కూడా రైల్వే విద్యుదీకరణకు భారత ప్రభుత్వాలు పెద్దగా ప్రాధన్యం ఇవ్వలేదు. 2014 వరకూ కూడా రైల్వే బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ విద్యుదీకరణ పనులు నత్తనడకన సాగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రైల్వే వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి విద్యుదీకరణ పనుల్లో వేగం పెరిగినట్లు రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
సౌర విద్యుత్ అనుసంధానం..
ప్రస్తుతం భారతీయ రైల్వే విద్యుదీకరణలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది. సాంప్రదాయ గ్రిడ్ విద్యుత్ పై ఆధారపడటాన్ని తగ్గించి సౌర విద్యుత్ దిశగా భారతీయ రైల్వేను కేంద్రం తీసుకెళ్తోంది. 2014 నాటికి రైల్వేల్లో సౌర విద్యుత్ వినియోగం 3.68 మెగా వాట్స్ గా ఉండగా.. 2025 నవంబర్ నాటికి అది ఏకంగా 898 MVకి పెరిగింది. అంటే రైల్వే ల్లో సౌర విద్యుత్ వినియోగం దాదాపు 244 రెట్లు పెరిగింది. దేశంలోని ఎలక్ట్రిక్ రైళ్లకు వినియోగిస్తున్న విద్యుత్ లో సుమారు 629 MV (70 శాతం) సోలార్ నుంచి వస్తోందని తాజా నివేదిక తెలిపింది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ సోదరుడికి సిట్ నోటీసులు
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు..
దేశంలోని రైల్వే నెట్ వర్క్ ను విద్యుదీకరణ చేయడం ద్వారా ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. డీజిల్ వినియోగం ఉన్నప్పటితో పోలిస్తే.. రైళ్ల సమయపాలన కాస్త మెరుగైనట్లు గణంకాలు చెబుతున్నాయి. రైళ్ల వేగం పెరగడం, కాలుష్యం తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రయాణికులు పొందుతున్నారు. డీజిల్ వినియోగంతో పోలిస్తే విద్యుదీకరణ తర్వాత రైళ్ల నిర్వాహణ భారం కేంద్రంపై భారీగా తగ్గింది. అలా ఆదా అయిన వ్యయాన్ని రైళ్లల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఖర్చు చేస్తోంది. అతి త్వరలోనే మిగిలిన 0.8 శాతం విద్యుదీకరణ పనులను కూడా పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మెుట్టమెుదటి అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశంగా నిలవాలని భారత్ భావిస్తోంది.

