Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు కొండల్ రెడ్డికి (Kondal Reddy) సిట్ (Special Investigation Team) నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన ఫోన్ తో పాటు సోదరుడు కొండల్ రెడ్డి మెుబైల్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించి.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కొండల్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేయనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా..
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. జైపాల్ యాదవ్ (Jaipal Yadav), చిరుమూర్తి లింగయ్య (Chirumarthi Lingaiah)లకు సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకావాలని సూచించింది. అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా రేపు సిట్ ముందుకు రానున్నట్లు సమాచారం. మరోవైపు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సైతం నుంచి పిలుపు అందింది. ఇవాళే (బుధవారం) విచారణకు రావాలంటూ ఆదేశించింది.
మలేషియాలో సందీప్ రావు
అయితే సందీప్ రావు ప్రస్తుతం కుటుంబంతో కలిసి మలేషియాలో ఉన్నారు. దీంతో సందీప్ రావు అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి కృష్ణారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. సందీప్ రావుకు చెందిన ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చెందిన సిమ్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో ట్యాపింగ్ వివరాలు అందించాలంటూ నోటీసుల్లో సందీప్ రావును కోరింది.
Also Read: BJP – Congress: రాజకీయాల్లో సంచలనం.. ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ.. కమలానికే అధికార పీఠం
గతంలోనే సందీప్ రావు విచారణ
కాగా 6 నెలల క్రితమే ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి సందీప్ రావు బయటకు వచ్చినట్లు కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సిట్ కు తెలియజేశారు. మలేషియా నుండి తిరిగొచ్చిన వెంటనే తన కుమారుడు సిట్ ఎదుట హాజరవుతారని స్పష్టం చేశారు. అయితే గతంలోనే ఓసారి సందీప్ రావును సిట్ విచారించింది. అతడు ఇచ్చిన స్టేట్ మెంట్ ను సైతం రికార్డు చేసుకుంది. మరోసారి వివరాలు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

