BJP – Congress: దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. స్థానిక ఎన్నిక కోసం చేతులు కలపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహారాష్ట్రలోని అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. శివసేన (షిండే) వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపి మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
డిసెంబర్ 20న జరిగిన అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ (Ambernath Municipal Council) ఎన్నికల్లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంది. మెుత్తం 60 స్థానాలకు గాను 27 స్థానాల్లో (ఒకరు స్వతంత్ర అభ్యర్థి) ఆ పార్టీ కార్పోరేటర్లు గెలుపొందారు. అయితే మేయర్ పీఠానికి అవసరైన 31 స్థానాలకు కొద్ది దూరంలోనే శివసేన ఆగిపోయింది. మరోవైపు ఈ ఎన్నికల్లోనే బీజేపీ 14, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నుంచి మరో నలుగురు విజయం సాధించారు.
ఒక్కటైన కాంగ్రెస్-బీజేపీ
శివసేన షిండే వర్గానికి ఛైర్మన్ పీఠం దక్కకూడదన్న ఉద్దేశంతో బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కటయ్యారు. అంబర్ నాథ్ అఘాడి కూటమిగా ఏర్పడ్డారు. వారు చేతులు కలపడంతో ఇరువురు బలం 26కి చేరింది. అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ (4), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను సైతం తమ గ్రూప్ లో చేర్చుకొని అంబర్ నాథ్ మేయర్ పీఠానికి కావాల్సిన బలాన్ని కూడగట్టారు. ముందస్తు ఒప్పందం ప్రకారం బీజేపీ అభ్యర్థి తేజశ్రీ.. అంబర్ నాథ్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Also Read: Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. గంటకు 150 కి.మీ వేగం.. టికెట్ రూ.5 మాత్రమే?
ఆగడాలకు చెక్ పెట్టడానికే..
అంబర్ నాథ్ అఘాడి గ్రూప్ లీడర్ గా బీజేపీ కార్పొరేటర్ అభిజిత్ రంజులే పాటిల్ ను నియమించారు. బీజేపీ – కాంగ్రెస్ చేతులు కలపడానికి గల కారణాలను పాటిల్ తెలియజేశారు. అంబర్ నాథ్ మున్సిపాలిటీ కౌన్సిల్ సుదీర్ఘ కాలంగా శివసేన గుప్పిట్లోనే ఉంటూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. శివసేన హయాంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆ పార్టీ అరాచకాల నుంచి అంబర్ నాథ్ కు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే కూటమి కట్టినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఈ చర్యను శివసేన (శిండే వర్గం) తీవ్రంగా తప్పుబట్టింది. ఇది బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని ఆరోపించింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) భాగస్వాములుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

