TG High Court: ప్రస్తుత రోజుల్లో భార్య, భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం. భర్త సరిగా మాట్లాడటం లేదని, భార్య వంట చేయడం లేదని ఇలా ఏదోక విషయం కొందరు దంపతులు గొడవపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య వంట చేయట్లేదని, ఇంటి పనులు పట్టించుకోవడం లేదని పిటిషన్ లో ఆరోపించారు. భర్త వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
భర్త పిటిషన్‌లో ఏముందంటే?
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పెళ్లయిన తర్వాత తన భార్య తనతో సరిగ్గా ఉండటం లేదని, తరచూ పుట్టింటికి వెళ్తోందని తన వాదనలో పేర్కొన్నాడు. వంట చేయకపోవడం, తల్లిని సరిగా చూసుకోకపోవడం వల్ల తాను నరకం అనుభవిస్తున్నట్లు ఆరోపించాడు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకొని తన పెళ్లిని రద్దు చేయాలని కోర్టును వేడుకున్నాడు. వెంటనే విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
హైకోర్టు షాకింగ్ కామెంట్స్..
భర్త దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ బీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య వాదనలు సైతం విన్న ద్విసభ్య ధర్మాసనం.. భర్తకు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కాదని తేల్చిచెప్పింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుటు ఇంటి పనులు చేయలేదనే కారణంతో విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చిన్న కారణాలను క్రూరత్వంగా భావించలేమని వ్యాఖ్యానిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read: Kavitha – Azharuddin: కవిత రాజీనామాకు అమోదం.. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ.. అజారుద్ధీన్‌కు లైన్ క్లియర్!
భార్య ప్రవర్తనకు కారణాలు!
భార్య, భర్తలు విడివిడిగా హైకోర్టుకు విన్నవించిన వాదనలు ప్రకారం.. దంపతులు ఇద్దరూ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. భర్త మధ్యాహ్నం షిఫ్ట్ (మ.1 గంట నుంచి రా.10 గంటల వరకు) పని చేస్తే.. భార్య ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆఫీసుకు వెళ్తోంది. కాబట్టి ఉదయం ఆమె వంట చేయలేకపోతుండటాన్ని తీవ్రంగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆఫీసుకు వెళ్తున్నందున తల్లిని చూసుకోవడం లేదన్న వాదనలోనూ బలం లేదని తేల్చి చెప్పింది. పెళ్లై కొద్ది రోజులకే గర్భస్రావం కావడం వల్ల ఆమె పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందని కాబట్టి ఈ ఆరోపణను సైతం పరిగణలోకి తీసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. భర్త చేస్తున్న ఆరోపణలు బలహీనంగా ఉన్నందున విడాకులు ఇవ్వలేమంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మారుతున్న జీవనశైలిని పరిగణలోకి తీసుకొని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.

