Depty CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు సైతం ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవన్ కు సాదర స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కొండగట్టు అంజన్నకు పవన్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో నమస్కరించారు.
వసతి గృహాలకు భూమి పూజ
అంజన్న స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన దీక్షా విరమణ మండపం, 96 గదుల వసతి సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్ల ఖర్చుతో భక్తుల కోసం టీటీడీ ఈ వసతి గృహాలను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు సైతం వసతి గృహాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. అయితే టీటీడీ నుంచి కొండగట్టుకు నిధులు రావడంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాన్ని నిర్మించాలని గతంలో ఆయన టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఇటీవల రూ.35 కోట్ల మంజూరు చేసింది.
కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దీక్షా విరమణ మండపం, 96 గదుల వసతి సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.#Kondagattu #Telangana pic.twitter.com/7k7iWCWxku
— JanaSena Shatagni (@JSPShatagniTeam) January 3, 2026
జనసేన నేతలతో భేటి
కొండగట్టు దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్.. నాచుపల్లి శివారులోని రిసార్ట్ కు వెళ్లనున్నారు. అక్కడ జనసేన నేతలు, శ్రేణులతో భేటి కానున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటి అనంతరం పవన్ తిరిగి ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఏపీకి తిరిగి వెళ్లిపోనున్నారు. ఇదిలా ఉంటే పవన్ పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు.. రిసార్ట్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.#Kondagattu #Telangana pic.twitter.com/pc25oWddM4
— JanaSena Shatagni (@JSPShatagniTeam) January 3, 2026
Also Read: Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!
కొండగట్టుతో అనుబంధం
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కు బలమైన అనుబంధం ఉంది. ఇక్కడి అంజన్న స్వామి అంటే పవన్ కు అపారమైన భక్తి. రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కొండగట్టులోనే తీసుకున్నట్లు పవన్ చెబుతుంటారు. అంతేకాదు తనను కరెంట్ షాక్ నుంచి ఆంజనేయ స్వామే రక్షించారని పవన్ నమ్ముతుంటారు. గతంలో వారాహి యాత్రకు పవన్ తన వాహనాన్ని తొలిసారి కొండగట్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అధికారులతో మాట్లాడుతూ మీకేమి సాయం కావాలని పవన్ కోరారు. వసతి గృహం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న పవన్.. టీటీడీతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు.

