Huzurabad News: ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు ఉండదని, ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగడం కాదు.. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్(Ganesh), ఉపసర్పంచ్ దండు రాజేష్(Rajesh) గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. మొలంగూరు(Moalanguru) గ్రామ శివారులోని సర్వే నెంబర్ 703లో గల ప్రభుత్వ భూమిని కాపాడాలని గత ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నా, యంత్రాంగంలో చలనం లేకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం వారు వినూత్నంగా కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
విచారణ జరిపి చర్యలు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సదరు భూమిని ఆక్రమణదారుల నుండి విడిపించి, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గత డిసెంబర్ నుండి అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ(MRO), డిపిఓ(DPO)లను ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కుంభకర్ణ నిద్ర పోతున్నారని మండిపడ్డారు. అధికారుల ఉదాసీనతను అలుసుగా తీసుకున్న ఆక్రమణదారులు, ప్రభుత్వ భూమిని ఏమాత్రం భయం లేకుండా సాగు చేసుకుంటున్నారని, అసలు ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉందా లేదా అని ఘాటుగా ప్రశ్నించారు.
Also Read: Cyber Crime Scam: ఖాకీలకే సైబర్ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?
ఉద్యమం ఉధృతం
అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, తక్షణమే ఆక్రమణలను తొలగించి పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాలేసి శ్రీనివాస్, దాసరపు నరేష్, కొంకటి అంజి, కోరపల్లి శివప్రసాద్, మోరె అజయ్, కోరపెల్లి శివ సాయి, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల.. వార్షిక నివేదిక విడుదల

