Cyber Crime Scam: నమ్మి లక్షలు పోగొట్టుకున్న సీఐలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సైబర్ క్రిమినల్స్ ఏకంగా పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఉచ్ఛులోకి లాగి లక్షలు కొట్టేశారు. ఓ సీఐ సైబర్ క్రైం విభాగంలోనే విధులు నిర్వర్తిస్తూ వలలో చిక్కుకోవడం గమనార్హం. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన సదరు సీఐలు సైబర్ క్రైం పోర్టల్‌కు ఫిర్యాదులు చేశారు. కాగా, సైబర్ కేటుగాళ్ల బారిన జనం పడకుండా చూడాల్సిన పోలీసులే వాళ్ల వలలో చిక్కి డబ్బు పోగొట్టుకోవటం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయంగా మారింది.
రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇన్స్ పెక్టర్ కు గత నెల 16న ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తనను తాను రిటైర్డ్ అదనపు ఎస్పీ నర్సింహరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తున్నట్టుగా చెప్పుకున్నాడు. ఆ తరువాత తన కుమారుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యిందని చెప్పి దానిని డీ ఫ్రీజ్ చేయటానికి సాయం చేయాలని అడిగాడు. వివరాలు పంపిస్తే చూస్తానని సీఐ చెప్పగా సరే అన్ని అపరిచిత వ్యక్తి ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఫోన్ చేయండి… వీఐపీ దర్శనంతోపాటు వసతి ఏర్పాట్లు చూసుకుంటానన్నాడు. అదే నెలలో సంగీతం టీచర్‌గా పని చేస్తున్న సదరు సీఐ భార్య తిరుమలలో జరిగే నాద నీరాజనం కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలుసుకొమ్మని భర్తను అడిగింది. దాంతో ఇన్స్పెక్టర్ తనను తాను అదనపు ఎస్పీ నర్సింహరెడ్డినని పరిచయం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేయగా అంతా తాను చూసుకుంటానని చెప్పాడు.
Read Also- Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి
రెండు రోజుల తరువాత ఫోన్ చేసి రెండు తేదీలు చెప్పి ఏది అనుకూలంగా ఉంటుందో చెబితే స్లాట్ బుక్ చేస్తానన్నాడు. దాంతో డిసెంబర్ 21వ తేదీని సీఐ ఖరారు చేయమన్నాడు. ఆ తరువాత తన కొడుకు లోకేశ్ నెంబర్ అని ఓ సెల్ నెంబర్ వచ్చిన అవతలి వ్యక్తి అతనితో మాట్లాడండి అని సూచించాడు. ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా ఏర్పాట్లు పూర్తి చేయటానికి 1.62 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. దాంతో సీఐ ఆ నగదును లోకేశ్ అంటూ మాట్లాడిన వ్యక్తి ఇచ్చిన ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం దర్శనం టిక్కెట్లు పంపించమని చెప్పాడు. అయితే, టిక్కెట్లు పంపించక పోవటం, అడిగిన ప్రతిసారి వాయిదా వేస్తుండటంతో అనుమానం వచ్చిన సీఐ విచారణ జరుపగా మోసపోయినట్టు తేలింది. దాంతో జరిగిన మోసాన్ని వివరిస్తూ ఆ సీఐ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట…
వెలుగు చూసిన ఈ ఉదంతం రేపిన కలకలం సద్దుమణగక ముందే రాచకొండ కమిషనరేట్ లోనే పని చేస్తున్న మరో సీఐ సైబర్ క్రిమినల్స్ బారిన పడి 39.37లక్షలు పోగొట్టుకున్నాడు. గత నెల 24న సదరు సీఐకి వాట్సాప్ కాల్ చేసిన కేటుగాడు దేవా ఏ టీం 13 పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చేర్చాడు. తాను చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు సంపాదించ వచ్చని ఆశ చూపించాడు. ఇది నమ్మిన సీఐ మొదట 50వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. దీనిపై సైబర్ క్రిమినల్ కొంత లాభం వచ్చినట్టుగా చూపించటంతోపాటు నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించటంతో సీఐ పూర్తిగా అతని వలలో చిక్కాడు. ఈ క్రమంలో మొత్తం 39.37 లక్షల రూపాయలను కేటుగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తరువాత వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకోవటానికి ప్రయత్నించగా వీలు పడలేదు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Read Also- Hindu Family Home Fire: బంగ్లాదేశ్‌లో ఆగని ఊచకోత.. హిందువులే టార్గెట్.. ఐదు ఇళ్లకు నిప్పు

