US Captures Maduro: వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా బలగాలు బంధించి, వెనిజులా వెలుపలకు తీసుకెళ్లామని (US Captures Maduro) తెలిపారు. వెనిజులా రాజధాని నగరం కారకస్‌పై అమెరికా మిలిటరీ చర్యకు పాల్పడిందని ఆయన ధ్రువీకరించారు. తిరిగి మళ్లీ ఇప్పుడు ఆ స్థాయి దూకుడు ప్రదర్శించింది. ‘‘అమెరికా విజయవంతంగా వెనిజులాపై, ఆ దేశ అధినేతపై భారీ దాడులు చేసింది. అధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన భార్యను కస్టడీలోకి తీసుకున్నాం. ఆ దేశం నుంచి బయటకు తీసుకెళ్లాం. అమెరికాలో చట్టాలు అమలు చేసే సంస్థలతో ఈ దాడులు నిర్వహించాం’’ అని ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. 1989 తర్వాత వెనిజులా ప్రభుత్వ విషయంలో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఆ దేశ వ్యవహారాల్లో ఈ విధంగా కల్పించుకోలేదు. 1989లో పనామా కాలువపై దాడి సమయంలో నాటి అధ్యక్షుడు మాన్యుల్ నొరేగా విషయంలో అగ్రరాజ్యం మిలిటరీ చర్యకు దిగింది. ఈ దాడికి సంబంధించిన వివరాలతో మీడియా సమావేశం నిర్వహిస్తానంటూ తెలిపారు.
అమెరికా కోర్టు విచారణకు మధురో!
అమెరికా బలగాలు అదుపులోకి తీసుకోవడంతో నికోలస్ మధురోను కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. క్రిమినల్ నేర అభియోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తమ దేశంపై తీవ్ర దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని వెనిజులా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి యాన్ గిల్ పిట్నో అన్నారు. నికోలస్ మధురో బతికి ఉన్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పిరికిపంద దాడైనా తమ దేశ పౌరులను బలహీనం చేయబోదని అన్నారు. మరోవైపు, అమెరికా దాడి చేయడానికి ముందు, చైనాకు చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందంతో నికోలస్ మధురో సమావేశం అయినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అత్యంత సన్నిహిత వ్యక్తితో మాట్లాడినట్టు సమాచారం.
మరోవైపు, అమెరికా జరిపిన దాడుల్లో ప్రాణనష్టం జరిగిందా?, లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, వెనిజులా నుంచి పడవల ద్వారా తమ దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటు అధ్యక్షుడు నికోలస్ మధురో పదవి నుంచి దిగిపోవాలంటూ గత కొన్ని వారాలుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఆ దేశంపై సైనిక చర్యకు దిగాల్సి ఉంటుందంటూ పలుమార్లు వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున వెనిజులా రాజధాని కారకస్‌పై అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి. స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 2 గంటల సమయంలో సైనిక ఆపరేషన్ జరిపాయి. కరాకస్ నగరంలో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. నగరం మీద యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ ఈ దాడులు జరిపాయి. బాంబు దాడులు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయి. భారీ శబ్దాలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పేలుళ్ల శబ్దాలకు నగరమంతా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొడుతున్నాయి. మంటల్లో తగలబడుతున్న భవనాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
Read Also- US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు
నార్కో-టెర్రరిజమ్.. అమెరికా ఆరోపణ
అమెరికాలోకి డ్రగ్స్ అక్రమ రవాణా కావడానికి వెనిజులా ప్రభుత్వమే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్ ఆరోపిస్తోంది. అధ్యక్షుడు నికోలస్ మధురో నార్కో-ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. డ్రగ్స్ అక్రమ రవాణాకు ఆయన ప్రభుత్వం సహకరిస్తోందని అమెరికా చెబుతోంది. వెనిజులా నుంచి డ్రగ్స్ తీసుకొని తమ దేశానికి వస్తున్న పడవలను డ్రోన్ సహాయంతో కూల్చివేశామంటూ అమెరికా ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. సెప్టెంబర్ నుంచి ఈ తరహా ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వెనిజులా గడ్డపై మిలిటరీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందంటూ ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. నికోలస్ మధురోను అధికారం నుంచి దించితేనే ఈ సమస్యకు ముగిసిపోతుందని భావించారు. అందుకే, సంచలన మిలిటరీ దాడికి తెరలేపారు.

