Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ సెస్ (రోడ్డు సేఫ్టీ టాక్స్) ఏర్పాటు చేయడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఇకనుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ద్విచక్ర వాహనాలకు రూ. 2వేలు, లైట్ మోటార్ వాహనాలకు 5వేలు, హెవీ వాహనాలకు 10 వేలు రోడ్డు సేఫ్టీ సెస్ విధించబోతున్నామని తెలిపారు. అసెంబ్లీలో మోటార్ వాహనాల పన్ను సవరణ చట్టంపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక టాక్స్ ఉండేదని, రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్‌కు సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5 శాతానికి చేయడం జరిగిందన్నారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, సుప్రీం కోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీ పై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే రోడ్ సేఫ్టీ సెస్ విధించడం జరుగుతుందని, ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఇది వర్తించదన్నారు.
Also Read: Ponnam Prabhakar: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై మంత్రి సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!
ఢిల్లీ తరహాలో
మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయనీ, జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం జరుగుతుందన్నారు. తాము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అఫిడవిట్ తీసుకురావాలని, ఇందు కోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. రోడ్డు భద్రతా పై విద్యార్థులకు ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. యూనిసెఫ్ సహకారంతో స్కూళ్లలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని, అధికారులు ప్రతి వాహనాన్ని చెక్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఎవరికి వారు స్వీయంగా వాహనాల ఫిట్నెస్ చూసుకోవాలని, నిబంధనలు పాటించాలని కోరారు.
ఈవీ పాలసీతో నియంత్రణ
బ్లాక్ స్పాట్లను నిర్మూలించేందుకు, అతి వేగాన్ని కట్టడి చేసేందుకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గూడ్స్ ఆటోలు, తేలికపాటి వాహనాలకు త్రైమాసిక టాక్స్ నుంచి లైఫ్ ట్యాక్స్‌కు మారుస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామని, దీనివల్ల ప్రభుత్వం సుమారు రూ. 1000 కోట్ల పన్ను ఆదాయాన్ని నష్టపోయిందన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీని అమలు చేస్తున్నామని, త్వరలో ఢిల్లీ మాదిరిగా ఇక్కడ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘వాహన సారధి’ పోర్టల్‌లో తమ ప్రభుత్వం రాగానే తెలంగాణను చేర్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Ponnam Prabhakar: నూతన సర్పంచ్‌లకు అలర్ట్.. అలా చేస్తేనే నిధులు.. మంత్రి పొన్నం

