Ponnam Prabhakar: గాంధీజీ కలలు కన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతనంగా గెలిచిన సర్పంచులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. అంతకుముందు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, వార్డ్ మెంబర్లను శాలువాలతో సన్మానించి అభినందించారు. మొదటి దశ ఎన్నికల్లో 85 శాతం ఓటింగ్ లో పాల్గొన్న గ్రామీణ ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల కు హృదయపూర్వక అభినందలు తెలియజేశారు.
గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన సర్పంచ్ లను కోరారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిదులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 17న ఎన్నికల కోడ్ ముగియగానే గ్రామాలకు కావలసిన ప్రతిపాదనలు సర్పంచ్ లు సమర్పించాలని అన్నారు. అలా చేస్తే పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని భీమదేవరపల్లిలో 17, ఎల్కతుర్తిలో 10 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని, ఓటింగ్ శాతంలో కాంగ్రెస్ ముందుందన్నారు.
Also Read: Local Body Elections: నల్గొండ జిల్లా పంచాయతీ పోరులో వర్గ పోరు.. పోలీసుల చొరవతో..!
నియోజకవర్గంలో 173 గ్రామాలకు గాను 16 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయన్నారు. తాను అభివృద్ధిని ఆకాంక్షించే వాడినని రానున్న 2, 3 విడతల్లో నియోజకవర్గంలోని మిగతా ఐదు మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులం అహర్నిశలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని, గెలిచిన సర్పంచుల సహకారం తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాలలోని ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా ఒక లేఖను పంపుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు చెప్పారు. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు.

