Wine Shop Owner: కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం
వైన్స్ షాప్ యజమాని ఇంట్లోనే లభ్యమైన బాటిళ్లు
స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
తూతూమంత్రంగా కేసు నమోదు
వైన్ షాప్ యజమానిని కాపాడే యత్నం!
ఎక్సైజ్ అధికారుల తీరుపై జనాల్లో అనుమానాలు
కారేపల్లి, స్వేచ్ఛ: కంచే చేను మేసిన చందంగా ఉందంటూ కారేపల్లి ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ మద్యంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులే, కల్తీమద్యం తయారీదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఓ వైన్ షాప్ యజమాని ఇంట్లో శుక్రవారం నాడు సోదాలు జరిపి 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఒక రోజంతా గోప్యంగా ఉంచి కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని కూడా శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు వెల్లడించారు. దీంతో, కేసు నమోదు చేసిన విషయాన్ని దాచిపెట్టడం వెనుక మతలబు ఏంటంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు… ఎక్సైజ్ అధికారులు 30 బాటిళ్లు స్వాధీనం చేసుకోగా, బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్‌కు చెందిన 16 మద్యం బాటిళ్ల మూతలు తీసి కల్తీ చేసినట్లు సమాచారం. దొరికిన బాటిళ్లను రీజనల్ కెమికల్ ల్యాబ్‌కు పంపడంతో కల్తీ భాగోతం బయటపడుతోంది. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో పాటు వైన్స్ షాప్ యజమానిని కాపాడటం కోసం తూతూ మంత్రంగా కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘‘మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నాం, కేసు కూడా నమోదు చేశాం’’ అని ఎక్సైజ్ ఎస్సై వసంత లక్ష్మి, సీఐ ప్రశాంతి విలేకరులకు వివరాలు వెల్లడించినప్పటికీ కేసు నమోదు చేసిన తీరునుబట్టి వైన్స్ షాప్ యజమానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి.
వివరాలు వెల్లడించడానికి ఎందుకు జాప్యం చేశారని, అంతలా గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందనే ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పష్టతనియాల్సిన అవసరం ఉందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. బెల్ట్ షాపుల్లో ఫుల్ బాటిళ్లు ఉండకూడదనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ ఈ వైన్ షాప్ యజమాని తన ఇంట్లో భారీగా ఫుల్ బాటిళ్లు ఉంచుకొని అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నా ఎక్సైజ్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి, దీనిపై అధికారులు క్లారిటీ ఇస్తారో వేచిచూడాలి.

