Abhinay Kinger death: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన చాలా కాలం మంచానికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు (నవంబర్ 10, 2025) తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు. అభినయ్ 2002లో విడుదలైన యువతరం చిత్రం ‘తుళ్లువదో ఇళమై’ (Thulluvadho Ilamai) ద్వారా బాగా పేరు పొందారు. ఈ చిత్రం దర్శకుడు సెల్వరాఘవన్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అగ్ర కథానాయకుడు ధనుష్‌లకు కూడా తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు ప్రధాన పాత్రలలో అభినయ్ కూడా ఒకరు.
సాయం కోసం విజ్ఞప్తి
గత కొంతకాలంగా అభినయ్ తీవ్రమైన కాలేయ వ్యాధి (Liver Disease)తో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, వైద్య ఖర్చులు అసాధారణంగా పెరగడంతో ఆయన గతంలో బహిరంగంగా ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వీడియో విజ్ఞప్తి సినీ వర్గాలలో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఆ వీడియోలో ఆయన తన అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ, “నాకు ఇంకొంత కాలం ఉంటుందో లేదో తెలియదు. వైద్యులు నాకు గరిష్టంగా మరో ఏడాదిన్నర మాత్రమే జీవితకాలం ఉందని చెప్పారు,” అంటూ కన్నారు మున్నీరయ్యారు. తన చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల కారణంగా దాతలు ఎవరైనా సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
అభినయ్ విజ్ఞప్తికి సినీ పరిశ్రమలోని సహచరులు వెంటనే స్పందించారు. ప్రముఖ హాస్యనటుడు KPY బాలా తక్షణమే ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. KPY బాలా మాత్రమే కాక, ఆ విజ్ఞప్తిని చూసిన అనేక మంది ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అభిమానులు ఆయనకు చికిత్స అందించడానికి తమ వంతు కృషి చేశారు. దురదృష్టవశాత్తూ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అభినయ్ ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. అభినయ్ భౌతికకాయాన్ని ప్రస్తుతం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన అభిమానులు ఆయనకు నివాళులర్పించడానికి తరలివస్తున్నారు.
Read also-Sunita Ahuja interview: బాలీవుడ్ నటుడు గోవిందపై సంచలన వ్యాఖ్యలు చేసిన భార్య సునీత..
అభినయ్ 2002లో వచ్చిన ‘తుళ్లువదో ఇళమై’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ చిత్రం అప్పట్లో యువతను ఆకట్టుకొని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇందులో ఆయన ధనుష్‌తో పాటు ప్రధాన పాత్రల్లో ఒకటైన విష్ణు పాత్ర పోషించారు. తొలి సినిమా విజయం తర్వాత, అభినయ్ కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. 2000ల చివర్లో, ఆయన సహాయ పాత్రలు పోషించడం మొదలుపెట్టారు. సొల్ల సొల్ల ఇనిక్కిమ్ (2009)వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత, అభినయ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ముఖ్యంగా విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తుపాకి’లో విలన్ పాత్రకు (విద్యాత్ జమ్వాల్) వాయిస్ అందించారు. అలాగే Anjaan (2014)లో కూడా విద్యాత్ జమ్వాల్‌కు డబ్బింగ్ చెప్పారు. ఆయన మరణానికి కొద్ది నెలల ముందు, ‘గేమ్ ఆప్ లోన్స్’ అనే చిత్రం ప్రెస్ మీట్‌లో కనిపించారు.
