Bhatti Vikramarka: గత పాలకులు కవులు, కళాకారులను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. జయ జయహే తెలంగాణ గీతంతో రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని నిర్ణయం తీసుకున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్దీకరణ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందెశ్రీగా పిలవబడే అందే ఎల్లయ్య తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో అనాథ అయిన అందెశ్రీ పశువుల కాపరిగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని గీత రచయితగా ఎదిగారన్నారు.
ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర
ఎలాంటి సాధికారత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ, అణగారిన వర్గాలను ప్రతిబింబించేలా ఆయన 3 వేల కవితలు రచించారని సభా ముఖంగా తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, పోరాటాలు వాటి స్ఫూర్తిని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. గౌరవనీయమైన వ్యక్తికి ప్రతీకగా నిలిచిన అందె శ్రీ వారసత్వం తెలంగాణ అంతట కొనసాగుతుందన్నారు. అందె శ్రీ విప్లవాత్మక కవితలు భావోద్వేగంతో కూడిన గేయాలు కార్మికులు, రైతులు, అణగారిన వర్గాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి పోరాటాలను వ్యక్తీకరించాయని, తెలంగాణ సంస్కృతికి స్వరంగా నిలిచాయన్నారు.
Also Read: Bhatti Vikramarka: కొత్త ఏడాది సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సందేశం
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
అందె శ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని 2- జూన్- 24 న 783 జీవో ద్వారా ఆమోదించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి అందె శ్రీ చేసిన అమూల్యమైన సేవలను దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ సమాజం అంటేనే కవులు, కళాకారులు, వారి దగ్గర ఉన్న కలలు అన్ని పీడిత ప్రజల విముక్తి కోసం సమ సమాజ నిర్మాణం కోసం, వారి ఆశయాలు, ఆశలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో చాలామంది కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంటూ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జయ జయ గీతాన్ని పెద్ద ఎత్తున వాడుకుని రాష్ట్రం సిద్దించిన తర్వాత నాటి పాలకులు ఆ గేయాన్ని, మనిషిని వదిలేశారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నామో రాష్ట్ర ప్రజలందరూ చూశారని భట్టి వివరించారు.
గత ప్రభుత్వం గద్దర్‌ను అవమానించింది
పొడుస్తున్న పొద్దు మీద పాటతో తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా గద్దర్ ఉపయోగపడ్డారని, అలాంటి వ్యక్తి నాటి సీఎం కేసీఆర్‌ను కలవడానికి వస్తే.. గంటల తరబడి ఎండలో నిలబడితే అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏ విధంగా గౌరవించుకుందో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఇస్తున్న నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డ్స్‌గా నామకరణం చేశామని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో సేవలు అందించిన పాశం యాదగిరి, జయరాజు, గూడ అంజన్న, గోరటి వెంకన్న లాంటి వారిని సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తించామన్నారు. వారి ఆటపాటల ద్వారా తెలంగాణ ప్రజల కోరికలను తెలియజేశారని తెలిపారు. కవులు, కళాకారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.
Also Read: Bhatti Vikramarka: అక్రిడేషన్ల జీవో 252 ను సవరించేందుకు తక్షణ చర్యలు: భట్టి విక్రమార్క

