MSG Trailer: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబినేషన్‌లో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి అనిల్ రావిపూడి వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి అంతగా ఇన్వాల్వ్ కాలేదు కానీ, అనిల్ రావిపూడి మాత్రం ఏ చిన్న అకేషన్‌ని వదలడం లేదు. ఇప్పటికే టీవీలో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ దూసుకెళుతుందంటే, అందుకు కారణం మాత్రం అనిల్ రావిపూడినే. జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌లో జనవరి 4, ఆదివారం తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ (MSG Trailer) లాంచ్ కార్యక్రమం నిమిత్తం తిరుపతి వెళ్లిన టీమ్.. ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?
వింటేజ్ మెగాస్టార్..
చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి మార్క్ మిస్సవ్వకుండా, మెగా ఇమేజ్‌ని డౌన్ కానివ్వకుండా చాలా జాగ్రత్తగా అనిల్ ఈ సినిమాను రూపొందించినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఇక వెంకీ ఎంట్రీతో ట్రైలర్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిలో చాలా కాలంగా మిస్సయిన కామెడీని, ఆయన టైమింగ్‌ను మరోసారి బయటకు తీశాడు అనిల్ రావిపూడి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి, ఎండింగ్ వరకు అమేజింగ్ జింగ్ జింగ్ అనే లెవల్లో ఉందంటే, అనిల్ రావిపూడి ప్లానింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్‌తో ఇప్పటి వరకు చిన్న, చితక ఉన్న నెగిటివ్ కూడా పోయి, సినిమాపై ఒక్కసారిగా భారీ క్రేజ్ ఏర్పడింది. మరోసారి సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా వస్తుందనే ఫీల్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి.
మాస్‌కే బాస్‌లా ఉన్నావ్
ఇంటిలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.. ఎలాంటి క్రిమినల్‌నైనా ఉతికి ఆరేస్తాడు.. తప్పు చేసిన వాడిని కోసి కారం పెడతడు అంటూ ఎలివేషన్ డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలైతే.. స్క్రీన్ మీద మాత్రం వేరే కనిపిస్తూ ఉంటుంది. మెగాస్టార్ బట్టలు ఉతికి ఆరేయడం, వంకాయలను కోసి కారం పెట్టి వంట చేస్తూ ఉండటం చూస్తుంటే.. స్టార్టింగే అనిల్ రావిపూడి మార్క్ కనిపించింది. ఇక కాసేపు మెగాస్టార్ వింటేజ్ లుక్‌ని పరిచయం చేసే, డైనమిక్ లేడీని ఇంట్రడ్యూస్ చేశారు. చిరు, నయన్‌ల మధ్య వచ్చే సీన్లు థియేటర్లలో కిక్కివ్వడం పక్కా అనేలా ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. పెళ్లాం తరుపు బంధువులతో ఆడుకుంటుంటే ఉంటదయ్యా.. అంటూ చిరు చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్, బాస్ లుక్ మాములుగా లేవు. ఇక విక్టరీ వెంకీ ఎంట్రీ మాత్రం అదుర్స్. ‘చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్‌లో ఉన్నావ్.. ఇలా మాస్ ఎంట్రీలిస్తున్నావేంటి?’ చిరు అడిగితే.. ‘మాస్‌కే బాస్‌లా ఉన్నావ్.. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా? ఏంటి?’ అని వెంకీ చెప్పడం.. అబ్బో.. ఈ సంక్రాంతికి దంచుడే దంచుడనేది తెలిసిపోతుంది. మొత్తంగా అయితే, ట్రైలర్ కుమ్మేసింది. ఇక ఏదైనా ఉంటే సంక్రాంతికి థియేటర్లలో చూసుకోవడమే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

