MLC Kavitha: హరీష్ రావు బినామీ కోసం హాస్పిటల్ అంచనాలు
MLC Kavitha (imagecredit:twitter)
Political News, Telangana News

MLC Kavitha: హరీష్ రావు బినామీ సంస్థ కోసం హాస్పిటల్ అంచనాల పెంపు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, శాశ్వతం అనుకున్న వాళ్లనే ప్రజలు ఇంట్లో కూర్చొబెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(MLC Kavitha) అన్నారు. ఆదివారం హనుమకొండలోని కాళోజీ నారాయణ రావు, జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తాను పక్కా పాలిటిక్స్ చేస్తానని అన్నారు. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నిరూపిస్తానని, అయితే దానికి ఇంకా సమయం ఉన్నదని చెప్పారు. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తానని, పార్టీలు లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలని సూచించారు. మిగతా నాలుగేళ్లు అభివృద్ది చేయాలని చెప్పారు.

హరీశ్ రావు బినామీకి కాంట్రాక్ట్

రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం పని చేయడం లేదని కవిత అన్నారు. ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తున్నదని చెప్పారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తానని, రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్2లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే కట్టడి చేశారని అన్నారు. అసత్య ప్రచారంతో బద్నా చేసే కుట్ర జరిగిందని చెప్పారు. కనీసం ఒక టీచర్‌ను ట్రాన్స్ ఫర్ చేసుకునే పరిస్థితి కూడా ఆనాడు లేదని, ఇంక అవినీతి ఎక్కడ చేస్తానని వ్యాఖ్యానించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూ.11 వందల కోట్ల నుంచి రూ.17 వందల కోట్లకు పెంచారని, హరీశ్ రావు(Harish rao) బినామీ కంపెనీకి పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని కవిత అన్నారు. అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ(Telangana) ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్ర పోయే పరిస్థితి ఉండాలని, మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని వ్యాఖ్యానించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలు పెట్టాలని, అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని అన్నారు. లేదంటే రాజకీయ నేతల పిల్లలు, వాళ్ల చుట్టాలే రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. తనలో ప్రశ్నించే తత్వం మారలేదని, రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం ఉప ఎన్నిక బిజీలో ఉన్నాయని, ప్రజల తరఫున అడిగేటోళ్లు లేరని అన్నారు. అందుకు తాము ఆ పని చేస్తున్నామని తెలిపారు.

బీసీల విషయంలో కమిట్‌మెంట్

బీసీలకు చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే తన లక్ష్యమని కవిత అన్నారు. ‘‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మొదటి అడుగు మాత్రమే. 20 ఏళ్లు బీఆర్ఎస్‌లో పని చేస్తే నన్ను అవమానకరంగా బయటకు పంపించారు. కనీసం నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. నేను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటా. అవమానాన్ని మాత్రం తట్టుకోను. పొలిటికల్‌గా బీఆర్ఎస్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమంది నష్టం జరగవచ్చు. నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పుడే రాజకీయం చేయాలనుకోవడం లేదు. సమస్యలపైనే పోరాటం చేస్తాను. లాస్ట్ ఇయర్ రాజకీయం చేస్తాం. ఆడపిల్లలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తా’’ అని అన్నారు.

Also Read; Tummala Nageswara Rao: పత్తి నిబంధనను తొలగించని కేంద్రం.. తెలంగాణకు కేంద్రం నో రెస్పాన్స్..!

ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిది

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని కవిత చెప్పారు. ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా వరంగల్ అని అన్నారు. వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గుర్తుకు వస్తారని, జాగృతి సంస్థకు ఆయనే స్ఫూర్తి అని తెలిపారు. ‘‘తెలంగాణ వ్యక్తులు రాజులకు, రాజ్యాలకు భయపడరు. బమ్మెర పోతన అప్పటి రాజు రాజరాజనరేంద్రుడికి తాను రాసిన వాటిని అంకితమివ్వాలంటే అందుకు ససేమిరా అన్నారు. మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన రాణి రుద్రమ గడ్డ ఇది. ఈ ప్రాంతానికి వస్తూ సమ్మయ్య నగర్‌లో వరద బాధితులను కలిశాం. పరకాలలో ఏకు శ్రీవాణి అనే అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించాం. వెల్ఫేర్ హాస్టల్‌లో చదవుకునే శ్రీవాణి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నది. మాదన్న పేట చెరువు, కాకతీయ విద్యార్థులతో ఛాయ్ పే చర్చా, ఇక్కడి లైబ్రరీ, ఎంజీఎం హాస్పిటల్‌కు వెళ్లాం. కటాక్షపురం బ్రిడ్జి పనులకు సంబంధించి కూడా పరిశీలించాం’’ అని వివరించారు.

పదేళ్లుగా ఇంటర్నల్ గొడవలతోనే సరి

పదేళ్లలో కూడా ఇంటర్నల్ సమస్యలపై కొట్లాడానని కవిత చెప్పారు. కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీతో మనకు పైసా పని కాలేదని, ఒక్క పెద్ద సమస్యను కూడా వాళ్లు తీర్చలేదని అన్నారు. ‘‘వరంగల్ అంటే రైల్వే హబ్. అలాంటి నగరంలో కూడా పెద్ద సమస్యను తీర్చలేదు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉండే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉన్నది. ఏ సమస్యలపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చారో ఆ సమస్యలన్నీ అలాగే పెండింగ్‌లో ఉంచారు. అందుకే మనం తెలంగాణ బిడ్డలుగా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేశారు. ప్రోటోకాల్ అనే తాడుతో నన్ను కట్టడి చేశారు. ఉద్యమంలో బతుకమ్మ సంబురాల్లో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను. కానీ ఆ తర్వాత నన్ను నిజామాబాద్‌కు మాత్రమే పరిమితం కావాలన్నారు. బీఆర్ఎస్‌లో నేను మంత్రిని కాదు. సంతకంతో పనులు అయిపోయే పరిస్థితిలో లేకుండే. కానీ నా వద్దకు వచ్చిన వారికి శక్తికి మించి పనులు చేసేందుకు ప్రయత్నించా. సీకేఎం కాలేజ్ ప్రొఫెసర్ గంగాధర శర్మని అడగండి. ఆ కాలేజ్‌ను ప్రభుత్వ కాలేజ్ చేయాలని ప్రయత్నించినా కాలేదు. అప్పుడు సీఎం కూతురిని అయినప్పటికీ నాకే పని కావడానికి ఏడాది పట్టింది. ఆ విధంగా నన్ను కట్టడి చేసినప్పటికీ ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్

Just In

01

Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!

YouTuber Controversy: అన్వేష్ దెబ్బకు వీడియో డిలేట్ చేసిన ‘ఏయ్ జూడ్’.. రీ అప్లోడ్ వీడియోలో వేరే లెవెల్ వార్నింగ్..

US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు

Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!

Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!