BRS Assembly walkout: మైక్ సాకుతో బహిష్కరణ డ్రామా
Political News

BRS Assembly walkout: మైక్ సాకుతో బహిష్కరణ డ్రామా.. ప్రతిపక్షమా? పక్కకు తప్పుకున్న పార్టీనా?

BRS Assembly walkout: శీతాకాల అసెంబ్లీ సమావేశాల రెండో రోజే బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. సభలో ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో పాటు ప్రభుత్వ తప్పిదాలను సైతం ఎండగట్టాల్సి ఉంది. కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీ రెండో రోజు మధ్యాహ్నమే సభా సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కసారిగా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై నేతలతో పాటు, క్యాడర్ సైతం షాక్‌కు గురైంది. సర్వత్రా విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

రెండేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదు 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ ముందుగానే ప్రకటించింది. రెండేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, హామీల వైఫల్యాలు, గ్యారంటీల అమలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి క్షీణించడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిందని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తామని తెలిపింది. అంతేకాదు, ఇరిగేషన్ రంగంపై వివక్ష చూపుతున్నదని, పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశాన్ని ప్రధానంగా అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయిచింది. పార్టీ అధినేత కేసీఆర్ సైతం డిసెంబర్ 21న తెలంగాణ భవన్‌లోని బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

తానే రంగంలోకి దిగుతున్నానని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో మూడు జిల్లాల రైతన్నలకు నష్టం జరుగుతున్నదని, వారి పక్షాన సభలకు సైతం ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కేసీఆర్ తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని అసెంబ్లీ, శాసన మండలిలో రెండేళ్ల తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించారు. అయితే, వారు బలంగా గళం వినిపిస్తారని అంతా భావించారు. కానీ, సమావేశాలను బాయ్‌కాట్ చేసిన తీరు చూశాక విమర్శలు ఎదురవుతున్నాయి.

Also Read: Gajwel – BRS: పార్టీ ఫండ్ చిచ్చు.. గజ్వేల్ బీఆర్ఎస్‌లో లుకలుకలు!.. ఎక్కడివరకు దారితీసిందంటే?

కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం

మూసీ పునరుజ్జీవంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. హరీశ్ రావు మాట్లాడే ప్రయత్నం చేయగా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో అసహన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకంగా సమావేశాలనే బాయ్‌కాట్ చేస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయం ఒక్కసారిగా మిగతా సభ్యులను సైతం విస్మయానికి గురి చేసినట్లు సమాచారం. మైక్ ఇచ్చేలా ప్రభుత్వంపై, స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి గాని ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వాకౌట్ అనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసనలు తెలిపేవారని, పోడియం వద్దకు వెళ్లి తమకు మైకు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసేవారని గుర్తు చేస్తున్నారు. అలాకాకుండా సమావేశాలను వాకౌట్ చేయడంపై విస్తృత చర్చ జరుగుతున్నది.

ఫీవర్ అంటూ కేటీఆర్ గైర్హాజరు?

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్వరం కారణంగా సమావేశాలకు రాలేదని సమాచారం. అయితే, సభలో మూసీపై జరిగిన చర్చపై సీఎం మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇచ్చేందుకు హరీశ్ రావు ప్రయత్నం చేశారు. అయితే, మైక్ ఇవ్వలేదు. పార్టీ సభ్యులు సైతం హరీశ్ రావుకి ఇవ్వాలని కోరినా స్పీకర్ నిరాకరించారు. సీఎం మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తాయని, తాము కౌంటర్ ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని భావించి అధిష్టానం సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేటీఆర్ లేని సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది.

హరీశ్ రావుకు చెక్ పెట్టే ప్రయత్నమా?

నదీ జలాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర కసరత్తు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు సైతం అవకాశం ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. అసెంబ్లీని సైతం 15 రోజులు పాటు నిర్వహించాలని బీఏసీలో కోరారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కృష్ణా జలాలపైన చర్చకు వచ్చిన, గోదావరి జలాలపైన ప్రభుత్వం చర్చ పెట్టినా, లేకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ లేవనెత్తినా కౌంటర్ ఇచ్చేందుకు హరీశ్ రావు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.

కవిత సైతం హరీశ్ రావు టార్గెట్‌

అయితే, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సమావేశాలను వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది హరీశ్ రావుకు చెక్ పెట్టినట్లేనని, ఆయనకు అసెంబ్లీలో అవకాశం ఇస్తే కింగ్ మేకర్ అవుతారని అందుకే వాకౌట్ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, కవిత సైతం హరీశ్ రావు టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని మండిపడ్డారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి పాలమూరు రంగారెడ్డి ఇతర ప్రాజెక్టులపై వివరించాలని, అప్పుడే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని వెల్లడించారు. హరీశ్ రావుతో ఇరిగేషన్‌పై మాట్లాడనివ్వొద్దని సూచించారు. ఆమె మాట్లాడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి గులాబీ పార్టీ వాకౌట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అందుకే.. బహిష్కరణ డ్రామా

మరోవైపు, సభలో ప్రభుత్వ దూకుడును అడ్డుకోలేక, సబ్జెక్ట్ లేక బీఆర్ఎస్ నేతలు సమావేశాలను వాకౌట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన భారీ తప్పిదాలు, నిధుల మళ్లింపు, కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పుకోలేకనే బీఆర్ఎస్ బహిష్కరణ డ్రామా ములు పెట్టిందని సెటైర్లు వేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన ధన దోపిడీని ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే, చర్చ నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం, పెండింగ్ ప్రాజెక్టులు, నీటి వాటాలపై ఏపీతో చేసుకున్న రహస్య ఒప్పందాలు బయటపడతాయని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేశారని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు.

Also Read: BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

Just In

01

Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన

Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!