Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు
Bandi Sanjay ( image credit: swetcha reporter)
Political News

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Bandi Sanjay: అందాల పోటీల మాదిరిగా హైదరాబాద్‌లో అబద్ధాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవార్డులు దక్కుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల వాటా వినియోగంలో ఆ రెండు పార్టీలు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయం చేస్తున్నదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాల్సిన పవిత్రమైన అసెంబ్లీని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీటి వాటా పంపకాల విషయంలో తెలంగాణకు మొట్టమొదట అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు.

తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా?

రాష్ట్ర విభజన చట్టం 2014లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపుల వివాదాలను టచ్‌ చేయరాదని పేర్కొంటూ విభజన చట్టంలో సెక్షన్ 89ను చేర్చి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? అని బండి ప్రశ్నించారు. నాటి నీటి కేటాయింపులపై పరిశీలిన చేసే అవకాశమే కొత్త ట్రైబ్యునల్‌కు లేకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్నారు. తెలంగాణాకు యూపీఏ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు 2023 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్‌కు సంబంధించి టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్ ఇస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని వివరించారు. తద్వారా, కృష్ణా బేసిన్‌ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్‌, లీగల్‌ వాదనలు సమర్థంగా వినిపించే అంశంపై దృష్టి సారించకుండా స్వార్థ రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా మాట్లాడుతుండటం సిగ్గుచేటని విమర్శించారు.

కేసీఆర్ ఏపీకి సాయం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేశారు

నీటి కేటాయింపుల్లో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి ఉద్దేశపూర్వక సాయం చేస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్ 2015 జూన్ 19న కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో, 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒప్పందం చేసుకుని తెలంగాణ హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఈ అంశాన్ని వివరిస్తూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ 2020 మే 12న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర జలశక్తికి తాను లేఖ రాసినట్లు బండి గుర్తుచేశారు.

Also Read: Bandi Sanjay: స్థానిక ఎన్నికల్లో రెండో విడతలో బీజేపీకి వచ్చిన సర్పంచ్ స్థానాలు ఇవే..!

ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు

ఆ సమయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెంటనే స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని కృష్ణా బోర్డును కోరితే.. ఆ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ చట్టబద్ధమైన ప్రయోజనాలను కాపాడాలని ఏపీ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు రాసినా.. కేసీఆర్ మాత్రం ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయలేదని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న సమయంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఆనాడు మళ్లీ తాను కేంద్రానికి లేఖ రాసి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు సంజయ్ వివరించరారు. కేంద్రం వెంటనే స్పందించి 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకున్నా.. ఆ సమావేశానికి కూడా కేసీఆర్ వెళ్లకుండా వాయిదా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా సాయం చేసి తెలంగాణకు తీరని నష్టం కలిగించారని వివరించారు. నీటి కేటాయింపులపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నా సుప్రీంకోర్టులో కేసుల పేరుతో దాదాపు 8 ఏళ్లపాటు కొత్త ట్రైబ్యునల్ రాకుండా జాప్యం చేసింది కూడా కేసీఆరేనని బండి తెలిపారు.

హరీశ్ రావుకు అవగాహన లేదు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని బండి మండిపడ్డారు. ఈ విషయంలో హరీశ్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అవగాహన లేదని ఎద్దేవాచేశారు. గోదావరి వాటర్ ట్రైబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా 45 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీలోని ఎగువ ప్రాంతానికి వినియోగించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ మొత్తం నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు వాడుకోవాలని కేంద్రం సూచించింది నిజం కాదా? అని పేర్కొన్నారు.

హరీష్ రావు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది

చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం మోపుతూ హరీష్ రావు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 టీఎంసీల నీటి వినియోగం సమగ్ర వివరాలు పంపక పోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను తిరిగి వెనక్కు పంపిందే తప్ప తిరస్కరించలేదని బండి సంజయ్ వివరించారు. ఈ విషయంలో నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. నీటి వినియోగం, కేటాయింపులపై కేంద్ర జల వనరుల సంఘం కోరిన వివరాలు పంపిస్తే తప్పకుండా డీపీఆర్ ఆమోదం పొందుతుందని, అలా చేయకుండా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి 60 శాతం నిధులను కేంద్రం నుంచి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు.

కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది

కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను బండి తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయిందన్నారు. ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే కూనంనేని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘కాలాపానీ’ జైలు సందర్శన

మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిరోజు చారిత్రక ‘కాలాపానీ’ జైలును సందర్శించారు. వీర సావర్కర్ నిర్బంధించబడిన సెల్‌ను సైతం బండి పరిశీలించారు. అనంతరం ఈ సెల్యులార్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షో కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. కాగా తొలుత బండి సంజయ్ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్‌ను సందర్శించారు.

Also Read: Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్

Just In

01

YouTuber Controversy: అన్వేష్ దెబ్బకు వీడియో డిలేట్ చేసిన ‘ఏయ్ జూడ్’.. రీ అప్లోడ్ వీడియోలో వేరే లెవెల్ వార్నింగ్..

US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు

Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!

Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!

Dil Diya First Look: చైత‌న్య రావు ‘దిల్ దియా’ పోస్టర్ చూశారా.. ఆ బోల్డ్ లుక్ ఏంటి భయ్యా..