Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వెల్లడైన గ్రామ పంచాయతీ రెండో విడుత ఫలితాల్లో బీజేపీ పుంజుకున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మొత్తం 98 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకుందని, మరో 20 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. ఈ రెండో దశ ఎన్నికల్లో భాగంగా గన్నేరువరం మండలంలోని పీచుపల్లి సర్పంచ్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి రాజిరెడ్డిని గ్రామస్థులంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా, రెండో దశలో బీజేపీ మొత్తం 30 స్థానాలను సాధించి ఎంతో పుంజుకుందని ఆయన వ్యాఖ్యానించారు. మండలాల వారీగా సాధించిన ఫలితాల విషయానికొస్తే, అత్యధికంగా గన్నేరువరంలో 5, శంకరపట్నం, మల్యాల, తంగెళ్లపల్లి మండలాల్లో నాలుగు చొప్పున గ్రామ పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుందని కేంద్ర మంత్రి వివరించారు.
మూడో విడుతకు యాక్షన్ ప్లాన్
తొలి దశ ఎన్నికల్లో 42 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని, మరో 8 స్థానాల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరినట్లు ఆయన వివరించారు. దీంతో రెండో దశ ఫలితాలను కలిపితే ఇప్పటివరకు మొత్తం 79 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 17న జరగబోయే తుది దశ ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకునేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సంజయ్ వివరించారు. ఈ మేరకు మండలాల వారీగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న గ్రామ పంచాయతీల జాబితాను తయారు చేశామన్నారు. ఆయా పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు విజయం సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించామని, చివరి రెండు రోజులు కూడా పోటీలో నిలిచిన అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని బండి సూచించారు.
ప్రజలు ఇబ్బంది పడుతుంటే..
రాష్ట్రంలో ఒకవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం మెస్సీ మ్యాచ్‌ను వీక్షించేందుకు, కేవలం వినోదం కోసమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏ సమస్య ఉన్నా తెలంగాణ యువతకు తక్షణమే అందుబాటులో ఉంటానని రాహుల్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ హామీలను ఆయన పూర్తిగా మరిచారని, ఆయన కేవలం వీఐపీ ఈవెంట్లు, ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుతోందని బండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు కూల్చివేత, విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్, రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలు, పెన్షన్లు, పదవీ విరమణ చెల్లింపులో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని ఆయన విమర్శించారు.
Also Read: Hollywood: షాకింగ్ ఇన్సిడెంట్.. భార్యతో సహ ప్రముఖ డైరెక్టర్ మృతి

