Warangal DSP Case: వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ అక్రమ వసూళ్ల ఆరోపణలపై విచారణ పూర్తయ్యింది. విచారణ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్టుగా సమాచారం. దీంతో సార్ కథ క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తున్నది. ఇక చర్యలే మిగిలాయ్ అంటూ ఏసీబీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. కాగా, దీని నుంచి తప్పించుకోవడానికి సదరు డీఎస్పీ ఇప్పటికీ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో అరెస్ట్ అయిన ఎమ్మార్వో స్థానంలో వచ్చిన అధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాను చెప్పినట్టుగా గత ఎమ్మార్వోపై నివేదికలు ఇవ్వాలని బెదిరింపులకు సైతం పాల్పడినట్టుగా తెలిసింది. అదే సమయంలో మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ నిర్వాసితుల నుంచి కూడా తనకు అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయా గ్రామాలకు కానిస్టేబుళ్లను పంపించి భూ నిర్వాసితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Also Read: DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం
అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తూ…
సీఐగా ఏసీబీ వరంగల్ రేంజ్‌కు వచ్చి డీఎస్పీగా ప్రమోషన్ పొంది ఆరేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి కొన్ని రోజుల క్రితం ఖిలా వరంగల్ ఎమ్మార్వోను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మార్వో నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌లోని కాల్, వాట్సాప్ డేటాను సదరు డీఎస్పీ సేకరించారు. ఆ తరువాత ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ అరెస్టయిన ఎమ్మార్వోకు మీరు బినామీ అని మా విచారణలో తేలింది. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ భయ పెట్టడం మొదలు పెట్టారు. అలా జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అరెస్టయిన ఎమ్మార్వోకు పరిచయం ఉండి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తితో కోటి రూపాయలకు బేరం కుదుర్చుకుని రూ.20లక్షలు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంట్లో సదరు డీఎస్పీకి హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఓ కీలక విభాగంలో పని చేస్తున్న అతని బ్యాచ్ మేట్ సహకరించినట్టు తెలుస్తున్నది.
ఫిర్యాదుతో రంగంలోకి..
డబ్బు కోసం డీఎస్పీ చేస్తున్న బెదిరింపులతో విసిగిపోయిన ఇద్దరు బాధితులు నేరుగా ఏసీబీ ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. రూ.20లక్షలు ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ను కూడా పంపించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఏసీబీ డీజీపీ చారూ సిన్హా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ అధికారి ఇప్పటివరకు ఏడుగురి నుంచి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు.
తప్పించుకునే ప్రయత్నాలు…
అవినీతి డొంక కదలడం ప్రారంభం కావడంతో అలర్ట్ అయిన వసూళ్ల సార్ దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తనకు రూ.20 లక్షలు ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పిలిపించుకున్నారు. భయపెట్టారో.. బతిమాలుకున్నారో తెలియదుగానీ సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో తాను ఎవ్వరికీ డబ్బు ఇవ్వలేదని చెప్పించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డీఎస్పీ బ్యాచ్ మేట్ ఎవరో కూడా తెలియదని అనిపించారు.
పక్కనే కూర్చోబెట్టుకుని..
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పక్కనే కూర్చోబెట్టుకుని అవినీతి డొంక కదలడంలో కీలకపాత్ర వహించిన వ్యక్తితో వసూళ్ల సార్ మాట్లాడటం. తన నోటితోనే హైదరాబాద్‌కు వచ్చా.. మా హెడ్ ఆఫీస్‌కు పిలిపించా.. పక్కనే కూర్చున్నాడని చెప్పి మరీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో మాట్లాడించడం. పైగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కే వాల్యూ ఉంటుంది. మిగితావాళ్ల వాంగ్మూలానికి అంత గ్రావిటీ ఉండదని చెప్పడం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పడటం గమనార్హం.
Also Read:Warangal District: వరంగల్‌లో ఏసీబీ అధికారి వసూళ్ల దందా.. లక్షల్లో డబ్బు వసూళ్లు
ఎమ్మార్వోకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని..
ఓ వైపు తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకుండా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఒప్పించిన సదరు డీఎస్పీ గతంలో తాను అరెస్ట్ చేసిన ఎమ్మార్వో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చూపించడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఖిలా వరంగల్ ఎమ్మార్వోగా ఉన్న అధికారితో అరెస్టయిన ఎమ్మార్వోకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా తెలిసింది.
కానిస్టేబుళ్లను పంపించి మరీ..
అదే సమయంలో మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ నిర్వాసితుల నుంచి కూడా అరెస్టయిన ఎమ్మార్వోకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట గ్రామాల్లో పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అరెస్టయిన ఎమ్మార్వో చేతుల మీదుగానే భూసేకరణ జరగడంతోపాటు నిర్వాసితులకు నష్ట పరిహారాలు అందాయి. తన అక్రమ వసూళ్ల వ్యవహారం నుంచి తప్పించుకోవడంతో పాటు అరెస్టయిన ఎమ్మార్వో అక్రమాలు చేశారని నిరూపించడానికి గాను ప్రస్తుతం డీఎస్పీ భూ నిర్వాసితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకోవడానికి యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయా గ్రామాలకు కానిస్టేబుళ్లు కొందరిని పంపిస్తూ నష్ట పరిహారం అందించడానికి అప్పటి ఎమ్మార్వో డబ్బు తీసుకున్నట్టుగా వాంగ్మూలాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, దీనికి భూ నిర్వాసితులు నిరాకరించినట్టుగా తెలిసింది.
ఆ ఫైళ్లు తీసుకున్నారు..
ఈ మొత్తం వ్యవహారంలో రూ.20 లక్షలు డీఎస్పీకి సమర్పించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో 2023లో 36గుంటల భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన చెల్లింపులను తానే జరిపారు. అయితే, ఈ భూమిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బినామీగా పెట్టుకొని ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన ఎమ్మార్వో కొన్నారని వసూళ్ల సార్ వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో హసన్‌పర్తి ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఈ భూమికి సంబంధించిన ఫైళ్లను కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. సస్పెన్స్ థ్రిల్లర్ లా రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ పూర్తి కావడం.. నివేదిక ఏసీబీ డీజీపీ చారూ సిన్హాకు చేరిన నేపథ్యంలో చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై ఏసీబీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
Also Read: Cyberabad Crime DSP: ఊరెళుతున్నారా జర భద్రం.. సైబరాబాద్ క్రైం డీసీపీ సూచనలు!
