Cyberabad Crime DSP: వేసవి సెలవులు వచ్చేశాయి…కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళుతున్నారా?..అయితే…జర భద్రం అని సూచిస్తున్నారు. సైబరాబాద్ క్రైం డీసీపీ ఎల్.సీ.నాయక్. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న దొంగలు ఇళ్లు గుల్ల చేయటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ బయటకు ఎక్కడికైనా వెళితే ఇంట్లో ఉండే బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. ఎండాకాలంలోనే దొంగలు స్వైర విహారం చేస్తుంటారన్నారు.
ఇలా చేయండి…
ఎక్కడికైనా వెళుతున్నట్టయితే ఎన్ని రోజులు వెళుతున్నారు? ఎప్పుడు తిరిగొస్తున్నారు? అన్న వివరాలను స్థానిక పోలీసులకు తెలియ చేయాలి. దీనివల్ల పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెడతారు. సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉన్న తాళాలను ఉపయోగించాలి. ఆయా ప్రాంతాల్లో ఉంటున్నవారు కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి ద్విచక్ర వాహనాలను ఇంటి కాంపౌండ్ లో పార్క్ చేసి వీల్ చెయిన్ తాళాలు వేయాలి. నమ్మకమైన వాచ్ మెన్ లేదా సెక్యూరిటీ గార్డును తాత్కాలికంగా నియమించుకోవాలి.
Also Read: Fake Certificates: అమెరికా వెళ్ళాలన్న ఆశ.. బెడిసికొట్టిన ప్లాన్!
ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటిని ఆన్ లైన్ ద్వారా తమ తమ మొబైల్ ఫోన్లలో గమనిస్తూ ఉండాలి. ఇక, బయటకు వెళ్లినన్ని రోజులు పాల ప్యాకెట్లు, పత్రికలను తెప్పించుకోవటం మానేయాలి. తాళం వేసినా ద్వారాలను పరదాలతో కప్పాలి. ఇంటి బయట వరండాలో కొన్ని లైట్లను ఆన్ చేసి పెట్టాలి. ఇంట్లోని బీరువా, లాకర్ల తాళాలను వెంట తీసుకెళ్లాలి. ఆయా కాలనీలు, బస్తీల్లో ఉంటున్న వారు రాత్రుళ్లు గస్తీ చేసే సిబ్బందికి సహకరించాలి. వారి ఫోన్ నెంబర్లను తీసుకుని పెట్టుకోవాలి.
అవసరమైనపుడు వెంటనే ఫోన్ చేయాలి. ఎన్ని రోజులు బయటకు వెళుతున్నారన్న వివరాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. దీనిని వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో పంచుకోవద్దు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్ తోపాటు 94906 17100, వాట్సాప్ నెంబర్ 94906 17444లకు సమాచారం ఇవ్వాలి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు