Cyber Fraud: జగిత్యాల జిల్లాకు చెందిన ఒక యువకుడు జీవనోపాధి కోసం ఇరాక్‌కు వెళ్లగా, అక్కడ సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన ముఠా, రూ.5 లక్షల సాయం చేస్తామని నమ్మబలికి, పన్నుల పేరుతో విడతల వారీగా బాధితుడి నుంచి ఏకంగా రూ.87వేలు కాజేసింది. ప్రస్తుతం ఇరాక్‌లో చిక్కుకుపోయిన బాధితుడు రాకేష్, న్యాయం కోసం మీడియాను ఆశ్రయించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన రాకేష్ అప్పులపాలై 10 రోజుల క్రితమే ఇరాక్‌కు వెళ్లారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక పోస్ట్‌ను రాకేష్ లైక్ చేయగా, ఇదే అదునుగా సైబర్ ముఠా రంగంలోకి దిగింది. హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన ముఠా, రాకేష్‌తో పరిచయం పెంచుకుంది. అతడికి విశ్వాసం కలిగించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆదార్ కార్డు కాపీని కూడా పంపించారు.
Also Read: Cyber Fraud: రూ.260 కోట్ల మోసం.. సైబర్ ఫ్రాడ్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ
విడతల వారీగా దోపిడీ
నీ అప్పులు తీర్చడానికి ఐదు లక్షలు సహాయం చేస్తాం’ అని చెప్పి రాకేష్‌ను పూర్తిగా నమ్మించారు. ఆ తరువాత, ఏకంగా రూ.6.5 లక్షలు ఫోన్‌పే ద్వారా పంపినట్టు నకిలీ స్క్రీన్‌షాట్లు పంపి మోసానికి పాల్పడ్డారు. డబ్బులు తమ ఖాతాలో జమ కాకపోవడంతో రాకేష్ ఆ ముఠాను ప్రశ్నించారు. దానికి వారు, ఫండ్ విడుదల కావాలంటే టాక్స్ చెల్లించాలని నమ్మబలికారు. గుడ్డిగా నమ్మిన రాకేష్, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి అప్పు తెచ్చి విడతల వారీగా మొత్తం రూ.87వేలు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా వారికి పంపించాడు. అయినా సాయం అందకపోగా, సైబర్ ముఠా సభ్యులు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగారు. డబ్బులు చెల్లించకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామని, కఠిన శిక్ష పడుతుందని బెదిరిస్తూ, భయపెట్టే వీడియోలు కూడా పంపారు. దీంతో, అప్పుల బాధతో ఇరాక్ వెళ్లిన రాకేష్, అక్కడ సైబర్ మోసానికి గురై మరింత అప్పులపాలయ్యాడు. న్యాయం కోసం వేరే దారి లేక రాకేష్ మీడియాను ఆశ్రయించారు.
Also Read: Cyber Fraud: ప్రతీ 20 నిమిషాలకో సైబర్ క్రైమ్.. రూ.700 కోట్లు స్వాహా.. జాగ్రత్త భయ్యా!
