Cyber Fraud: దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. సాంకేతికతను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సైబర్ నేరాలకు (Cyber Crime) సంబంధించి తాజాగా విడుదలైన నివేదిక.. యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లలో ప్రతి నిమిషాలకు ఒక సైబర్ మోసం జరిగినట్లు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్ట్ వెల్లడించింది.
రెండేళ్లలో 67,389 కేసులు
చత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు సునీల్ సోని, గజేంద్ర యాదవ్.. అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్ట్ (National Cybercrime Reporting Portal) బయటకు వచ్చింది. దీని ప్రకారం.. 2023 జనవరి నుంచి 2025 జూన్ మధ్య 67,389 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. తద్వారా వందల కోట్ల రూపాయలు సైబర్ కేటుగాళ్లు దోచుకున్నారు. ఫిర్యాదుదారులు మోసమోయిన డబ్బు విలువ ఏకంగా రూ.791 కోట్లు ఉంటుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ యాప్‌లు, మోసపూరిత కాల్స్, సోషల్ ఇంజనీరింగ్ వంటి విధానాల ద్వారా సైబర్ కేటుగాళ్లు ఈ మెుత్తాన్ని దోచేసినట్లు తెలియజేసింది.
రికవరి.. 0.2 శాతమే!
డిజిటల్ క్రైమ్స్ కు రాజధానిగా పిలవబడుతున్న ఒక్క రాయ్ పూర్ లోనే ఏకంగా 16 వేల సైబర్ కేసులు నమోదైనట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో కేవలం 107 మంది బాధితులు మాత్రమే తిరిగి తమ డబ్బును పొందగలిగారని తెలిపింది. ఇవి నమోదైన కేసుల్లో ఇది 0.2 శాతం మాత్రమేనని తెలిపింది. ఇక బ్యాంకులకు సంబంధించిన మోసాల విషయానికి వస్తే కేవలం 3 కేసులను మాత్రమే ఛేదించగలిగారు. దానికి సంబంధించి ఏడుగురును అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ చాలా వరకూ కేసులు పరిశోధించే దశలోనే ఉన్నాయని సైబర్ క్రైమ్ రిపోర్ట్ పేర్కొంది.
అసెంబ్లీలో చర్చ
సైబర్ క్రైమ్ నేరాలపై ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ సోని.. ఆర్థిక నష్టాలు వినాశకరమైనవని అభిప్రాయపడ్డారు. కేటుగాళ్ల మోసాల బారిన పడి.. చాలా మంది బాధితులు.. ఆత్మహత్య వరకూ వెళ్లారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాలను ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అంగీకరించారు. సైబర్ నేరాలు.. యావత్ ప్రపంచానికి సవాలుగా మారాయని అన్నారు.
Also Read: Ind vs Eng Test: గంభీర్ గారూ.. అతడ్ని తీసేయండి సార్.. మాజీ క్రికెటర్ డిమాండ్!
ప్రభుత్వం కీలక చర్యలు
మరోవైపు రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు డివిజన్లలో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మరో తొమ్మిది స్టేషన్లకు బడ్జెట్‌లో ఆమోదం తెలిపింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ సెల్ ఏర్పాటు చేయగా.. రాయ్‌పూర్‌లో ఒక ప్రత్యేక సైబర్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సైబర్ నేరాల కోసం ప్రత్యేకించి 129 మంది సిబ్బందిని నియమించారు. సైబర్ కమాండో స్కీమ్ ద్వారా టెక్-సావీ పోలీసు బృందాన్ని కూడా ప్రభుత్వం తయారు చేస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ, సీ-డాక్ ఐ4 వంటి సంస్థల్లో వారికి శిక్షణ ఇస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 24/7 పనిచేసేలా 1930 హెల్ప్ లైన్ నెంబర్ ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.