Dinosaur Skeleton Auction: అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆసక్తికరమైన వేలం జరిగింది. న్యూయార్క్ లోని సోథెబీస్ గీక్ వీక్ (Sotheby’s geek week) లో జరిగిన వేలంలో అంతరిక్ష శిల, డైనోసార్ అస్థిపంజరం అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ రెండు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి.. యావత్ ప్రపంచం దృష్టిని తమ వైపునకు తిప్పుకున్నాయి. అంగారక శిల 5.3 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.44 కోట్లు) అమ్ముడుపోగా.. డైనోసార్ అస్థిపంజరం (Dinosaur skeleton) ఏకంగా 30.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 255 కోట్లు) విక్రయించబడింది. తద్వారా అంగారిక శిలపై డైనోసార్ స్కెల్టన్ పై చేయి సాధించగలిగింది.
అంగారక శిల ప్రత్యేకత తెలుసా
అంగారక గ్రహం నుంచి భూమికి చేరిన మార్టియన్ మెటీరైట్ (Martian meteorite).. భూమిపై అతిపెద్ద మార్స్ శిలగా ఉంది. దీనికి ఎన్ డబ్ల్యూఏ 16788 (NWA 16788) పేరు పెట్టారు. 2023లో నైజర్ లోని సహారా ఏడారిలో దీనిని తొలిసారి కనుగొన్నారు. ఈ శిల ఒక అసాధారణమైన ఆలివిన్-మైక్రోగబ్బ్రోయిక్ షెర్గోటైట్ రకానికి చెందినదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ అంగారక శిల.. దాదాపు 140 మిలియన్ మైల్స్ ప్రయాణించి భూమికి చేరింది. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అగ్నిగోళంగా మండి దాని ఉపరితలం గాజులా తళతళమెరిసే స్థితికి చేరుకుంది. తొలుత ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియకపోవడంతో.. నాసాకు చెందిన వైకింగ్ మిషన్ డేటాతో దీని రసాయన కూర్పును సరిపోల్చి ఇది అంగారక గ్రహం నుంచి వచ్చినట్లు తేల్చారు. తాజాగా సోథెబీస్ లో జరిగిన వేలంలో ఈ శిల 4.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోగా.. అదనపు ఫీజులతో కలిపి మెుత్తం ధర 5.3 మిలియన్ డాలర్లకు చేరింది.
Also Read: Kavitha on BRS: మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు.. కవిత
డైనోసార్ అస్థిపంజరం ఎప్పటిదంటే?
ఇక సోథెబీస్ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం డైనోసార్ ఆస్థి పంజరం. ఇది అరుదైన సెరాటోసారస్ జాతి (Ceratosaurus nasicornis skeleton)కి చెందిన డైనోసార్ కు సంబంధించినది. దీనిని 1996లో వ్యోమింగ్‌లోని బోన్ క్యాబిన్ క్వారీలో కనుగొన్నారు. 6 అడుగుల ఎత్తు, 11 అడుగుల పొడవు కలిగిన ఈ డైనోసార్ అస్థిపంజరం.. 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి లేట్ జురాసిక్ కాలానికి చెందినదని పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డైనోసార్ కు చెందిన దాదాపు 140 ఎముకలు లభించగా.. దానికి మరికొన్ని శిల్పకళా పదార్థాలను జోడించి ఆస్థిపంజరం రూపాన్ని తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే సోథెబిస్ వేలంలో దీనిని సొంతం చేసుకునేందుకు ఆరుగురు బిడ్డర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికీ 26 మిలియన్ డాలర్ల వద్ద దానిని ఓ బిడ్డర్ కొనుగోలు చేశారు. అదనపు ఫీజులతో కలిపి దీని ధర 30.5 మిలియన్ డాలర్లకు చేరింది. వేలంలో అమ్మబడిన మూడో అతి ఖరీదైన డైనోసార్ అస్థిపంజరంగా ఇది నిలిచింది. 2024లో 44.6 మిలియన్ డాలర్లకు అమ్మబడిన స్టెగోసారస్ ‘ఏపెక్స్’ (Apex) ఈ జాబితాలో టాప్ లో ఉంది. తాజాగా డైనోసార్ ను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాని అస్థిపంజరాన్ని ఒక సంస్థకు లోన్ గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సోథెబీస్ గీక్ వీక్ 2025 వేలంలో అంగారక శిల, డైనోసార్ అస్థి పంజరంతో పాటు మరిన్ని విలువైన వస్తువులు విక్రయానికి వచ్చాయి. ఇందులో 122 ఇతర మెటీరైట్లు, శిలాజాలు, రత్నాలు ఉన్నాయి.