GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీ కాలం గడువు ముగింపు దశకు చేరుకుంది. 2021 ఫిబ్రవరి 11న కొలువుదీరిన పాలక మండలికి వచ్చే ఫిబ్రవరి 11తో గడువు ముగియనుంది. అంటే, ఇష్టారాజ్య పాలనకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకా కేవలం వంద రోజులు మాత్రమే అధికారంలో ఉండనుంది. ఈ నేపథ్యంలో, కనీసం చివరి రోజుల్లోనైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న తపనతో పలు పార్టీల కార్పొరేటర్లు తహతహలాడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: GHMC: మహిళా సాధికారతకు కొత్త రూపు.. యువతులకు ఎస్‌హెచ్‌జీల్లో అవకాశం!
చివరి రోజుల్లో..
మరికొద్ది నెలల్లోనే కౌన్సిల్ టైమ్ ముగియనున్నందున, కనీసం చివరి రోజుల్లోనైనా తనకు సహకరించాలని మేయర్ ఇప్పటికే పలుసార్లు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే జోనల్ కమిషనర్లకు అడిషనల్ పవర్స్ అప్పగించేలా కమిషనర్‌పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ పదవీ కాలం దగ్గరపడుతుండటంతో కొందరు కార్పొరేటర్లు టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకుని, పైరవీలు మొదలుపెట్టారు. కొందరు పాలక మండలి పెద్దలు తమ పవర్ గడువు దగ్గరపడుతున్నందున ‘సమయం లేదు మిత్రమా! మాకు సహకరించాలి’ అంటూ వివిధ విభాగాధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన నాలుగున్నరేళ్లలో ఎపుడూ టౌన్ ప్లానింగ్ విభాగంలో కనిపించని కొందరు కార్పొరేటర్లు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఐదో అంతస్తులోని ప్లానింగ్ ఆఫీసులో జోనల్ సీపీలు, సీసీపీల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వస్తుండగా, మరికొందరు బడా నిర్మాణాలను టార్గెట్ చేసుకుని, డీవియేషన్స్ ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి, బిల్డర్లను భయపెట్టేందుకే వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వివాదాలమయం!
2020 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ విజయం సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ నుంచి గెలిచిన గద్వాల విజయలక్ష్మి 2021 ఫిబ్రవరి 11న మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మేయర్ తరుచూ పలు వివాదాల్లోనే కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మేయర్ కనీసం సొంత పార్టీ కార్పొరేటర్లను, డిప్యూటీ మేయర్ శ్రీలతను కూడా కలుపుకుని పోవడం లేదని విమర్శలు వచ్చాయి. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భవన నిర్మాణదారులను మేయర్ అనుచరవర్గం వేధింపులకు గురి చేస్తున్న ఆరోపణలు వెల్లువిరిశాయి. నాలుగున్నరేళ్లలో మేయర్ అధ్యక్షతలోని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్లో ఎక్కువ అర్థరహితమైనవేనన్న విమర్శలు లేకపోలేదు. ప్రతి సమావేశంలో సభ్యుల ప్రశ్నలను దాటవేస్తూ వచ్చిన మేయర్ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. ఈ నెలాఖరులో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ తర్వాత..
023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మేయర్, డిప్యూటీ మేయర్లకు కీలక మలుపుగా మారాయి. కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో తమ పదవులను కాపాడుకునేందుకు మేయర్, డిప్యూటీ మేయర్‌లు పార్టీ మారారు. డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది రోజులకే అప్పటి గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న మేయర్ తండ్రి కే. కేశవరావు, కూతురు విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్‌లు పార్టీ మారినా, వారి తరపున ఒక్క కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. పలువురు కార్పొరేటర్లు ఎవరికివారే స్వచ్ఛందంగా చేరిన వారే తప్ప, వారి మద్దతుతో చేరిన వారెవరూ లేరు.
ఎన్నో అనుమానాలు!
జీహెచ్ఎంసీ పరిధిలో ఏ పని చేపట్టినా, అది మెయింటెనెన్స్ అయినా, ప్రాజెక్టులు అయినా స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి తీసుకోవాలన్న తీర్మానాన్ని కొద్ది నెలల క్రితం స్టాండింగ్ కమిటీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టెండర్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తీసుకోవాలన్న ఈ తీర్మానం వెనక ఆంతర్యం ఏమిటన్నది హాట్ టాపిక్‌గా మారింది. అభివృద్ధి, మెయింటెనెన్స్ ప్రతిపాదనకు ఆమోదం తప్పనిసరి అన్న సాంప్రదాయం ఉన్నప్పటికీ, దానిని టెండర్ల ప్రక్రియ వరకు కొనసాగించటం వెనకా పాలక మండలి పెద్దలు, కార్పొరేటర్ల ఉద్దేశ్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: GHMC: బల్దియాలో ఏడాదిగా కీలక పదవి ఖాళీ.. హాట్ కేకులా మారిన పోస్ట్
