GHMC: రాష్ట్రంలోనే అతిపెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ(GHMC)లో చీఫ్ ఎంటమాలజిస్ట్(Chief Entomologist) పోస్టు గత ఏడాదిగా ఖాళీగా ఉండటం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటి చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు రిటైర్ అయిన అక్టోబర్ నుంచి ఇప్పటికీ ఈ పోస్టు భర్తీ కాలేదు. స్టేట్ మలేరియా డిపార్ట్‌మెంట్ నుంచి అర్హత కలిగిన అధికారిని నియమించాలని పూర్వ కమిషనర్ ఇలంబర్తితో పాటు ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Commissioner R.V. Karnan) కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకపోయింది. దీని ఫలితంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో దోమల నివారణ చర్యలు సాంకేతికంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ వంటి చర్యలు కూడా అశాస్త్రీయంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తీరిక లేదే..!
ప్రస్తుతం చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఇన్‌ఛార్జీ చీఫ్ ఎంటమాలజిస్ట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, హెల్త్ విభాగంలో బర్త్(Birth), డెత్(Dertha) సర్టిఫికెట్ల జారీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణతోనే ఆమెకు సమయం సరిపోవడం లేదు. ఇన్‌ఛార్జీగా ఉన్నా, ఆమె ఏ ఒక్క రోజు కూడా చీఫ్ ఎంటమాలజిస్ట్ సీటులో కూర్చొని దోమల నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించలేదు. దీనికి ఆమెకు టెక్నికల్ అవగాహన లేకపోవడమే కారణమని వాదనలున్నాయి. పూర్తి స్థాయిలో మలేరియా విభాగంలో పనిచేసే అధికారిని నియమిస్తేనే ఫీల్డ్ లెవెల్‌లో సరైన పర్యవేక్షణ ఉంటుందని కొందరు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్నారు. పర్యవేక్షణ లోపం కారణంగానే కొద్ది నెలల క్రితం లంగర్ హౌజ్ చెరువులో దోమల నివారణకు వెళ్లిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు మృతి చెందిన ఘటనలో, సంబంధిత సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకుని అధికారులు చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: Kapil Sharma café: మరోసారి కపిల్ శర్మ కెనడా కేఫేలో కాల్పుల కలకలం.. ఎందుకంటే?
హాట్ కేకుగా పోస్టు
జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్టు హాట్ కేకుగా మారిందని, ఈ సీటు కోసం సచివాలయం, సీఎం స్థాయి వరకు పైరవీలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం కొందరు సీనియర్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ భర్తీ కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం వాతావరణంలో వేగంగా మార్పులు జరుగుతున్న తరుణంలో, డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, వెంటనే ఈ కీలక పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: John Wesley: గవర్నర్ వైఖరికి నిరసనగా నేడు ఉత్కండంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు
