John Wesley: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర తలపెట్టిన ఛలో రాజ్ భవన్ తీవ్రం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్(Hyderabad) లోని ఖైరతాబాద్(Khairathabad) మెట్రో స్టేషన్ నుంచి నుంచి సోమాజిగూడ వరకు శుక్రవారం ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు మెట్రో రెసిడెన్సీ వద్ద అడ్డుకున్నారు. అప్పటికే బారికేడ్లు వేసి ముందుకెళ్లకుండా నిలిపివేయడంతో నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తొలగించుకుని వెళ్లేందుకు కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. వారిని అడ్డుకున్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని అనుమతించారు. రాజ్ భవన్ గేటు వద్దే లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బృందం బైఠాయించింది. బీసీలకు వ్యతిరేకంగా గవర్నర్ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ, బీజేపీ బీసీ వ్యతిరేక విధానాలు వీడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని నినదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొద్ది సేపటి తర్వాత అక్కడ్నుంచి పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చర్చించేందుకు సిద్ధంగా లేని గవర్నర్..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధంగా లేని గవర్నర్ దానిపై కనీసం చర్చించేందుకు కూడా ఇష్టపడటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నారన్నారు. నెలన్నరకు పైగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూడు రోజుల క్రితమే గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగామనీ, బీసీల గురించి మాట్లాడేందుకు వస్తే కలవడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. బీసీలకు, సామాజిక న్యాయానికి, రిజర్వేషన్లకు వ్యతిరేక వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. మనువాదంతో వ్యవహరిస్తూ కలిసేందుకు నిరాకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, మోటార్ సైకిల్ ర్యాలీలు తదితర రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. గవర్నర్ తీరు మార్చుకోకుంటే ఆయన బదిలీ కోరాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీకి వ్యతిరేకంగా బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ చేస్తేనే అందులో సీపీఐ(ఎం) పాల్గొంటుందని మరోసారి స్పష్టం చేశారు. లేకపోతే సీపీఐ (ఎం) ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. 18న నిరసనలతోనూ దిగిరాకపోతే కలిసొచ్చే శక్తులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షం తీసుకునే నిర్ణయాలకు సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నాయకులు ఎస్.వీరయ్య, మహ్మద్ అబ్బాస్, టి.జ్యోతి, టి.సాగర్, నంద్యాల నర్సింహారెడ్డి, బండారు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kapil Sharma café: మరోసారి కపిల్ శర్మ కెనడా కేఫేలో కాల్పుల కలకలం.. ఎందుకంటే?
