– పదో తరగతిలో 89 స్కూళ్లలో 100% పాస్
– మిగిలిన గురుకులాల కంటే మనమే ముందున్నాం
– అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
– బాగా పనిచేసే వారికి ప్రోత్సాహమిస్తాం
– మంచి ఆహారం, క్రీడలపైనా ఫోకస్ చేయాలి
– స్కూల్ టీచర్ల సమీక్షలో సంస్థ ఉపాధ్యక్షులు ఫాహీం ఖురైషీ
Congress Govt: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ కీలక అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు హజరు కాగా, సంస్థ ఉపాధ్యక్షులు ఫాహీముద్దీన్ ఖురైషీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ఎస్సెస్సీ ఫలితాల్లో సొసైటీ పరిధిలోని మొత్తం 204 గురుకుల పాఠశాలలు ఉండగా, ఈ ఏడాది వీటిలోని 89 గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయని, ఈ ఏడాది మరింత మంచి ఫలితాలు సాధించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన గుర్తు చేశారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని, అదే విధంగా వారి శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం మీదా పాఠశాలలోని సిబ్బంది దృష్టి పెట్టాల్సిన అవసరముందని గుర్తుచేశారు. అవసరాన్ని బట్టి విద్యార్థులకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి, వారిని ఉత్సాహపరచాలని సూచించారు. ప్రతి పాఠశాలలోనూ క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విద్యార్థులు శారీరకంగానూ ఫిట్‌గా ఉంటారన్నారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా అవినీతికి తావులేకుండా అధికారులంతా పనిచేయాలని, ఈ విషయంలో ఏమాత్రం బాధ్యతా రాహిత్యం ఉన్నా కఠినమైన చర్యలు తప్పవని ఖురైషీ హెచ్చరించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై క్రమశిక్షణా చర్యలుంటాయని, అలాగే బాగా పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఒక క్రీడాకారుడిగా ఉన్న తాను తొలిసారి విద్యా రంగ బాధ్యతలు చూస్తున్నాననీ, తొలి ఏడాదిలోనే మైనారిటీ విద్యాసంస్థలు మంచి ఫలితాలు సాధించటం శుభపరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వేరే సొసైటీల కింద నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల కంటే మైనారిటీ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయని, ఇది ఇకపై మరింతగా ముందుకు సాగాలని, దీనికోసం ప్రిన్సిపాల్స్, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్..సంస్థ అధికారులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. స్కూళ్ల నిర్వహణలో ఎవరైనా ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా తాను హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటానని, అందరం కలిసి మైనారిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తునిద్దామని ఆయన పిలుపునిచ్చారు.