Ramchander Rao: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం, పైడిపల్లె గ్రామంలో సర్పంచ్ ఎన్నికల మూడో విడుత ఓట్ల లెక్కింపు సందర్భంగా గందరగోళం చోటుచేసుకుందని, అందుకే మళ్లీ రీకౌంట్ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇలాంటి దురదృష్టకర, కలవరపెట్టే సంఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. పారదర్శకంగా సాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ, తీవ్రమైన అక్రమాలు, పరిపాలనా వైఫల్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఫలితాల లెక్కింపు సందర్భంగా ఒక బ్యాలెట్‌కు చెందిన ఓట్లు లెక్కించలేదని బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల మమత తరపు మద్దతుదారులు చెప్పారన్నారు.
రీకౌంట్ అడగడం న్యాయమే
కేవలం 17 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినట్లు చూపించారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రీకౌంట్ అడగడం న్యాయమేనని, కానీ ఎన్నికల అధికారులు సరైన పరిష్కారం చూపకపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందన్నారు. రీకౌంట్ కోరుతూ శాంతియుతంగా లెక్కింపు కేంద్రానికి వచ్చిన బీజేపీ మద్దతుదారులపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజలను రెచ్చగొట్టేలా గాల్లో కాల్పులు, లాఠీచార్జ్ జరపడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలపై లాఠీ చార్జీ చేయగా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గంగుల నగేశ్ కు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం భద్రత కల్పించిందన్నారు. ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికార ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. పైడిపల్లె గ్రామంలో ఓట్లను పోలీసు బందోబస్తులో వెంటనే రీకౌంట్ చేయాలని రాంచంందర్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Ramchander Rao: ఉన్న కార్పొరేషన్‌కే సౌకర్యాలు లేవు మళ్లీ విలీనమా? : రాంచందర్ రావు

