Ramchander Rao: పరిపాలన సౌలభ్యం కోసం పాలనను డీసెంట్రలైజ్ చేయాలే తప్ప, సెంట్రలైజ్ చేయటం సరి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో 27 అర్బన్ లోకల్ బాడీల విలీనాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీకే సరిపోయే నిధులు, సౌకర్యాలు లేవని, మళ్లీ దాని పరిధిని ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
Also Read: Ramchander Rao: దమ్ముంటే ఇండియాకు రండి.. విదేశాల్లో ఉండి విమర్శించడం కాదు : రాంచందర్ రావు
విలీనం ఏ మాత్రం శాస్త్రీయంగా లేదు
గతంలో ఎంసీహెచ్‌ను జీహెచ్ఎంసీగా మార్చినప్పుడు మల్కాజిగిరి పరిధిలోని వారు బంజారాహిల్స్‌లోని వారికంటే ఎక్కువ పన్ను కట్టారని గుర్తు చేస్తూ, మళ్లీ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను విలీనం చేయటం అంటే ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా, అదనపు భారం మోపటమేనని ఆయన విమర్శించారు. బల్దియాలో మున్సిపాలిటీల విలీనం ఏ మాత్రం శాస్త్రీయంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏకపక్షంగా విలీనం చేయటం సరికాదు
ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేయటం సరికాదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఢిల్లీ, బెంగళూరులను మూడు భాగాలు చేసినప్పుడు అక్కడి పాలకులు విఫలమైన విషయాన్ని రాంచందర్ గుర్తు చేశారు. ‘పరిపాలన సౌలభ్యం కోసం స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ అని, చిన్న రాష్ట్రం కొరకే కదా తెలంగాణ తెచ్చుకుందని ఆయన వివరించారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ : రాంచందర్ రావు

