H1B visa fee hike: హెచ్-1బీ వీసాల ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ.88 లక్షలు) పెంచుతూ (H1B visa fee hike) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం భారతీయ వీసాదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డెడ్‌లైన్‌ను కూడా సెప్టెంబర్ 21గా పేర్కొనడంతో, హెచ్-1బీ వీసాదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ ప్రకారం, సెప్టెంబర్ 21న తెల్లవారుజాము 12:01 ఏఎం ఈడీటీకి ముందుగా (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:31) అమెరికాలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ సమయం తర్వాత చేరుకుంటే, హెచ్-1బీ వీసాదారులను స్పాన్సర్ చేసే కంపెనీ (ఉద్యోగం చేసే సంస్థ) ఏకంగా 100,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే, అమెరికాలోకి అనుమతించరు.
ఈ పరిణామంతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఒకింత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రకటన వెలువడిన వెంటనే, కొంతమంది భారతీయ ఐటీ నిపుణులు విమానాల నుంచి దిగిపోయిన ఘటనలు నమోదయ్యాయి. సాధారణంగా విదేశాల్లో పనిచేసే చాలా మంది భారతీయులు దుర్గాపూజ సమయంలో స్వదేశానికి తిరిగివస్తుంటారు. ఈ ఏడాది వచ్చేవారమే దుర్గాపూజ మొదలవనుంది. అందుకోసం బయలుదేరినవారిలో చాలామంది ట్రంప్ ప్రకటన కారణంగా విమానాలు దిగేశారు.
భారీగా పెరిగిన టికెట్ ధరలు
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో భారత్‌లోనే చిక్కుకుపోయినవారు, గడువులోగా (సెప్టెంబర్ 21) అమెరికా చేరుకునేందుకు త్వరపడుతున్నారు. చాలామంది డైరెక్ట్ ఫ్లైట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, అమెరికాకు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్స్ టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్రంప్ నిర్ణయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని భావించిన విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచినట్టు తెలుస్తోంది. సాధారణంగా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఒక్క వైపు విమాన టికెట్ ధర సుమారుగా రూ.37 వేలు ఉంటుంది. కానీ, ట్రంప్ ప్రకటన తర్వాత కేవలం 2 గంటల్లోనే రూ.37,000 నుంచి రూ. 70,000-80,000కి ఎగబాకింది. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి ఫ్లైట్ల టికెట్ రేట్లు ఇప్పుడు 4,500 డాలర్లకు చేరాయని, హెచ్-1బీ వీసా రూల్స్ మారిపోతుండడమే ఇందుకు కారణమని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. భారతీయ హెచ్-1బీ వీసాదారులు త్వరగా అమెరికాకు తిరిగి వెళ్తున్నారని తెలిపాడు.
అమెరికా వదిలి వెళ్లకండి.. ఐటీ దిగ్గజాల పిలుపు
హెచ్-1బీ వీసా రూల్స్ మార్చివేసి, సెప్టెంబర్ 21 తేదీని గడువు విధించడంపై ఇటు వీసాదారులతో పాటు టెక్ దిగ్గజ కంపెనీలు సైతం ఉలిక్కిపడ్డాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి అగ్ర టెక్ కంపెనీలు.. హెచ్-1బీ వీసా ఉన్న తమ ఉద్యోగులు యూఎస్ నుంచి స్వదేశాలకు వెళ్లవద్దని సూచించాయి. అదేవిధంగా, ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు వెంటనే యూఎస్‌కు తిరిగి రావాలని కోరారు. కాగా, సెలవులు లేదా ఇతర పనుల నిమిత్తం భారత్‌లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు ఇప్పటికే గడువును కోల్పోయినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, హెచ్-1బీ వీసా రూల్స్ మార్పు నిర్ణయం భారతీయులపైనే అత్యధిక ప్రభావం చూపనుంది. ఎందుకంటే, హెచ్-1బీ వీసాలదారుల్లో సుమారు 70 శాతం మంది భారతీయులే కావడమే ఇందుకు కారణంగా ఉంది.