Most Expensive Cruise: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్‌గా పిలువబడుతున్న ప్రయాణాన్ని రెజెంట్ సెవెన్ సీస్ (Regent Seven Seas) ప్రకటించింది. 2027లో “వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్” (World of Splendor) యాత్ర సెవెన్ సీస్ స్ప్లెండర్ నౌకపై ప్రారంభం కానుంది. మియామీ నుంచి న్యూయార్క్ వరకు ఈ లగ్జరీ ప్రయాణం సాగనుంది. ఈ ప్రయాణంలో 40 దేశాల్లోని 71 పోర్టులను ఈ నౌక చేరనుంది. ఈ క్రూయిజ్ భారత్ లో నాలుగు పోర్ట్ లలో ఆగనుండటం విశేషం.
టికెట్ ధరలు ఇలా..
వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ యాత్రకు సంబంధించిన టికెట్ ధరలను రెజెంట్ సెవెన్ సీస్ తాజాగా ప్రకటించింది. ప్రారంభ టికెట్ ధర రూ.80 లక్షలుగా నిర్ణయించింది. అత్యంత విలాసవంతమైన రెజెంట్ సూట్ లో ప్రయాణించదలచిన వారికి రూ.7.3 కోట్లుగా టికెట్ నిర్ణయించారు. ఏ ఇతర లగ్జరీ క్రూయిజ్ షిప్ తో పోల్చినా.. ఈ స్థాయిలో టికెట్ ధర లేకపోవడం గమనార్హం. కాబట్టి రెజెంట్ సెవెన్ నౌక ప్రయాణం.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనదిగా పిలవబడుతోంది.
రెజెంట్ సూట్‌లో ఏముంది?
రెజెంట్ సూట్.. ఎప్పటినుంచో సముద్రంలో అత్యంత విలాసవంతమైన వసతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 40 దేశాలను తాకుతూ సాగే ఈ యాత్రలో రెజెంట్ సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సూట్ తీసుకున్న వారికి నౌక నిర్వాహకులు ప్రత్యేక సౌఖర్యాలు, సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ప్రతీ పోర్టులో ఒక ప్రైవేటు కారు, డ్రైవర్ ను ఇస్తారు. అలాగే ఇన్ సూట్ స్పా, అరుదైన ఫైన్ ఆర్ట్ కలెక్షన్, షిప్ లో 4,000 చదరపు అడుగుల (దాదాపు రెండు టెన్నిస్ కోర్టులు కలిపినంత) వ్యక్తిగత స్థలం అందించబడుతుంది. 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ నౌకపై ఇంకా పెద్ద స్కైవ్యూ రెజెంట్ సూట్ ను ప్రారంభించనున్నారు. దీని ధర రాత్రికి రూ. 20–22 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటివరకు రికార్డైన అత్యంత ఖరీదైన సూట్ రేటు.
66,057 కి.మీ ప్రయాణం..
వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ – 2027 క్రూయిజ్ ప్రయాణానికి సంబంధించి వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ నౌక.. 6 ఖండాల్లో మొత్తం 35,668 నాటికల్ మైళ్లు (66,057 కి.మీ.) ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. లాస్ ఏంజెల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బసలు ఉండనున్నాయి. ముంబయితో పాటు భారత్ లోని మంగళూరు, కొచ్చి, గోవా పోర్టులలో ఈ షిప్ ఆగనుంది. 126 రాత్రుల చిన్న వెర్షన్ ట్రిప్.. రోమ్‌లో ముగుస్తుంది. కానీ పూర్తి ప్రయాణం న్యూయార్క్ వరకు కొనసాగుతుంది.
వినోదమే వినోదం
ప్రయాణంలో 486 వరకు ఉచిత షోర్ ఎక్స్కర్షన్స్, మూడు ప్రత్యేక గాలా ఈవెంట్స్, ఇంకా బిజినెస్/ఫస్ట్-క్లాస్ అంతర్జాతీయ విమానాలు, లగ్జరీ హోటల్ బస, లగేజ్ సర్వీస్, ప్రీమియం పానీయాలు, ప్రత్యేకమైన డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!
746 మందికి మాత్రమే…
సెవెన్ సీస్ స్ప్లెండర్ నౌకలో కేవలం 746 మంది ప్రయాణికులే ఉంటారు. ప్రతీ ప్రయాణికుడికి విలాసవంతమైన అనుభూతిని పంచేందుకు అతి కొద్ది మంది ప్రయాణికులతో మాత్రమే ఈ నౌక ప్రయాణం జరుగుతుంది. ఈ షిప్ లో 24 గంటల పాటు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఫ్రెంచ్ హాట్ కుయిజిన్ నుంచి ప్రైమ్ 7 స్టాక్ హౌస్ వరకూ విలాసవంతమైన రెస్టారెంట్లు షిప్ లో ఉంటాయి.