CM Revanth Reddy (Image Source: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: 20 నెలల పాలనలో.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని.. కళ్లకు కట్టిన సీఎం రేవంత్

CM Revanth Reddy: సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లోని గన్ పార్క్‌లో అమర వీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదని సీఎం అన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛాపతాకను ఎగుర వేసిన రోజు ఇదేనని  గుర్తు చేశారు.

‘తప్పులుంటే.. దిద్దుకుంటున్నాం’
సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి అని.. అదే విధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయి సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం. ప్రతి పేదవాడి మొఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘విద్యనే విజయానికి వజ్రాయుధం’
ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే తమ ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘అభివృద్ధిలోనే కాదు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంటుంది. విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం. గొప్ప విజన్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం. భవిష్యత్ లో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు. భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్ కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా నిలుస్తాయి. రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం’ అని రేవంత్ అన్నారు.

మహిళ సంక్షేమం గురించి..
‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ ద్వారా ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించంది. ఖమ్మం “మహిళా మార్ట్” విజయవంతంగా నడుస్తోంది. రాష్ట్రంలో మరికొన్ని మహిళ మార్ట్ లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం’ అని సీఎం అన్నారు.

‘రైతుల కోసం రూ.1,04,000 కోట్లు ఖర్చు’
ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో రూ.1,04,000 కోట్ల రూపాయలు రైతుల ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచాం. ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం’ అని రేవంత్ అన్నారు.

20 నెలల్లో 60 వేల ఉద్యోగాలు
ప్రజా ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయం అందించాం. ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా గత పాలకులు ముద్ర వేశారు. భూ భారతి చట్టం తెచ్చాం.క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఇటీవలే 5 వేల మంది గ్రామ పాలనా అధికారులను నియమించాం’ అని సీఎం రేవంత్ వివరించారు.

ఇందిరమ్మ ఇండ్లపై..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని సీఎం అన్నారు. ‘తొలి విడతగా రూ. 22,500 కోట్ల రూపాయలతో, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర లక్షల మంది పేదలు సొంత ఇంటివారవుతున్నారు. సన్నబియ్యం సంక్షేమ పథకానికి ఈ రోజు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి నిత్యం సన్నబియ్యంతో ఈ రోజు భోజనం చేయగలుగుతున్నారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ జీవనాడులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది, ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరేలా వ్యూహరచన చేస్తున్నాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Modi – Trump: ప్రధాని బర్త్‌డే స్పెషల్.. మోదీని ఆకాశానికెత్తిన ట్రంప్.. ఆపై థ్యాంక్స్ కూడా..

‘ప్రపంచానికి గేట్ వేగా హైదరాబాద్’
హైదారాబాద్ మహానగరం తెలంగాణ బలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఈ బ్రాండ్ ను భవిష్యత్ లో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘ కాలిక ప్రణాళికలు రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ప్రపంచానికి హైదరాబాద్ గేట్ వే గా మారుతుంది. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేం మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నాం. రోడ్లు, విద్యుత్, రహదారులు, రవాణా సదుపాయాలు, మురుగు నీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్నీ కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్ ను మార్చాలి. లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారుతోంది. దరాబాద్ నగరానికి వచ్చే వందేళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలు తీసుకువస్తున్నాం రూ.7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2,3 దశల పనులను ఇటీవలే ప్రారంభించుకున్నాం’ అని సీఎం రేవంత్ అన్నారు.

Also Read: Illegal Construction: తూంకుంటలో అక్రమ నిర్మాణాలకు బ్రేక్.. స్పందించిన అధికారులు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?