Shocking News: బిహార్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల క్రితమే చనిపోయాడని భావించిన వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలతో తిరిగి వచ్చాడు. దీంతో తొలుత షాక్ అయిన అతడి కుటుంబం.. ఆ తర్వాత ఆనందోత్సహాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
బీహార్ ఈస్ట్ చంపారన్ జిల్లాలోని ఓ కుటుంబంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగినా సాహ్నీ (Nagina Sahni) తన భార్య, బిడ్డ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 2009లో గంగాసాగర్ యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ తప్పిబోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినప్పటికీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇంటికి తిరిగివెళ్లిన కుటుంబ సభ్యులు.. సాహ్నీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో సాహ్నీ చనిపోయి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారు. చివరకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
సోషల్ మీడియా కారణంగా..
సాహ్నీ కుమారుడు రుదల్ (Rudal) ఇటీవల సోషల్ మీడియా చూస్తుండగా ఓ వ్యక్తి అతడి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లోని వృద్ధాశ్రమంలో తీసిన ఆ వీడియోలో సాహ్నీని చూశాడు. అచ్చం తన తండ్రి రూపంలాగే ఉందని అనుమానించిన రుదల్.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గుజరాత్ లోని ఆశ్రమానికి చేరాడు. అక్కడ సాహ్నీని చూసి తన తండ్రేనని రుదల్ నిర్ధారించుకున్నాడు. చనిపోయాడని భావించిన తండ్రిని చూడగానే రుదల్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
కుమారుడి భావోద్వేగం
మరణించాడని భావించిన తండ్రి బతికి ఉండటంతో రుదల్ అనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘ఇక ఎప్పటికీ నా తండ్రిని చూడలేమని అనుకున్నాం. ఆయన ఆత్మ శాంతించాలని అంత్యక్రియలు కూడా చేశాం. కానీ దేవుడు ఈ అద్భుతం చూపించాడు. మళ్లీ మా తండ్రిని తిరిగి పొందగలిగాం’ అని రుదల్ సంతోషం వ్యక్తం చేశాడు. అనంతరం తండ్రిని బిహార్ లోని తన స్వస్థలానికి రుధాల్ తీసుకొచ్చాడు. ఇతర కుటుంబ సభ్యులు సైతం సాహ్నీని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అతడి క్షేమ సమాచారాలు అడిగి తెలుకున్నారు.
Also Read: CM Revanth Reddy: 20 నెలల పాలనలో.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని.. కళ్లకు కట్టిన సీఎం రేవంత్
గ్రామస్థులు ఘన స్వాగతం
అంతకుముందు సాహ్నీ రాకకు సంబంధించిన సమాచారం మెహ్వా గ్రామమంతా పాకిపోయింది. దీంతో గ్రామస్థులు అంతా కలిసి.. తండ్రి కుమారులకు ఘన స్వాగతం పలికారు. ఒకప్పుడు సాహ్నీ అంత్యక్రియల్లో పాల్గొన్న స్థానికులే.. తిరిగి అతడ్ని ఘనంగా ఊర్లోకి స్వాగతించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనను కొందరు దైవకృపగా వర్ణిస్తే.. మరికొందరు సోషల్ మీడియా పవర్ అని కొనియాడుతున్నారు.