US Corn Threat: టారిఫ్‌లపై ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యంగా భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, చర్చలు ప్రారంభం కాకముందే అమెరికా బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. తమ దేశంలో పండిన మొక్కజొన్నను కొనకపోతే, అమెరికా మార్కెట్ యాక్సెస్‌ను భారత్ కోల్పోతుందని (US Corn Threat) ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లూత్నిక్ హెచ్చరించారు. భారతదేశంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఆయన మాట్లాడారు. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లూత్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం టారిఫ్‌లను తగ్గించుకోకుంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత్ విషయంలో దూకుడు తగ్గించినప్పటికీ, లూత్నిక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also- Handshake controversy: అతడిని తొలగించండి.. భారత్‌తో మ్యాచ్‌పై ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు
భారత్-అమెరికా సంబంధాలు ఏకపక్షంగా ఒకరే లాభపడే విధంగా ఉన్నాయని, వాళ్లు (భారత్) తమ ఉత్పత్తులన్నీ అమ్ముతూ ప్రయోజనాన్ని పొందుతున్నారని లూత్నిక్ ఆరోపించారు. ఇదే సమయంలో వాళ్ల (భారత్) మార్కెట్‌లోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘మనం మాత్రం వాళ్లకు అన్ని తలుపులు తెరిచి ప్రయోజనాలు కల్పిస్తున్నాం. మా దేశ జనాభా 140 కోట్ల మంది అని భారత్ చెబుతోంది. అంతమందిలో కనీసం ఒక్కరైనా ఒక బషెల్ (ధాన్యపు కొలమానం) అమెరికా మొక్కజొన్నను ఎందుకు కొనరు?. వాళ్లు వారి ఉత్పత్తులన్నీ మనకు విక్రయిస్తారు. కానీ, మన మొక్కజొన్న మాత్రం కొనరు. ప్రతిదానిపై టారిఫ్‌లు విధిస్తారు. ఇది అసహనంగా అనిపించదా?’’ అని హోవార్డ్ లూత్నిక్ ప్రశ్నించారు.
Read Also- Gurramgadda Village: మా గ్రామానికి ఉపాధ్యాయుడ్ని నియమించండి.. కలెక్టర్ కు విద్యార్థులు మొర!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో స్వయంగా కల్పించుకొని భారతదేశాన్ని హెచ్చరించారని లూత్నిక్ గుర్తుచేశారు. ‘‘మీ సుంకాలు తగ్గించండి. మేము మిమ్మల్ని ఏవిధంగా గౌరవిస్తున్నామో మీరు కూడా మమ్మల్ని అలాగే గౌరవించండి’’ అని ట్రంప్ సూచించారంటూ లూత్నిక్ ప్రస్తావించారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడం తమ లక్ష్యమని, అందుకే ఈ మధ్య తాము భారత ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తున్నామని, సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్నామని లూత్నిక్ వివరించారు. ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహమని, భారత్ అంగీకరిస్తే బాగుంటుంది, లేకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల దేశంగా ఉన్న అమెరికాతో వ్యాపారం చేయడం చాలా సంక్లిష్టంగా మారిపోతుందని ఆయన హెచ్చరించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
భారత వస్తువులపై అమెరికా టారిఫ్‌లను 50 శాతానికి పెంచడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొన్ని వారాలపాటు సున్నితంగా కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతవారం కీలక ప్రకటన చేసి పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. భారత్‌తో వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో తాను త్వరలో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య సంబంధాల్లో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనబోతున్నట్టుగా కనిపిస్తోంది. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా తుది దశకు చేరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.