Siddaramaiah: దేశంలో మత మార్పిడిలపై చర్చ జరుగుతున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరు మాత్రం ఎందుకు మతం మారుతారు?’’ అని ఆయన ప్రశ్నించారు. నిజంగా సమానత్వం ఉంటే అంటరానితనం వ్యవస్థ ఎలా వచ్చిందని అడిగారు. ‘‘అంటరానితనాన్ని మనం సృష్టించామా?. ఇస్లాం, క్రిస్టియన్, ఇతర ఏ మతంలోనైనా అసమానతలు ఉన్నాయేమో. మతం మారాలంటూ మేమూ, బీజేపీ వాళ్లు ఎవరికీ చెప్పలేదు. కానీ, ప్రజలు మతం మారవచ్చు. అది వాళ్ల హక్కు’’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.
సిద్ధ రామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోక స్పందించారు. సమానత్వం విషయానికి వస్తే, తమరెప్పుడూ హిందూమతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంటారని మండిపడ్డారు. ‘మీరు ముఖ్యమంత్రి కదా’ అని విమర్శించారు. ‘‘సిద్ధరామయ్య గారూ.. ముస్లిం మతంలో సమానత్వంపై ప్రశ్నించే ధైర్యం మీకుందా’’ అని అశోక సూటి ప్రశ్న వేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, మసీదుల్లో మహిళల ప్రవేశంపై నిషేధం వంటి అంశాలను ప్రస్తావించి ముస్లిం మతంలోని కొన్ని అంశాలను ప్రశ్నించారు. ముస్లిమేతరుల పట్ల ఖురాన్ చెబుతున్న విషయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అశోక ఇంకేమన్నారంటే?
‘‘అవును నిజమే, హిందూ సమాజానికి కులవ్యవస్థ ఒక శాపం లాంటిది. ఇది వాస్తవమే. కానీ, కాలక్రమంలో హిందూ సమాజాన్ని మెరుగుపర్చేందుకు ఎంతోమంది గొప్ప సంస్కరణవాదులు జన్మించారు. తనంతట తానుగా మార్పును స్వీకరించి, తప్పుల్ని సరిదిద్దుకునే శక్తి హిందూ సమాజానికి ఉంది. బసవన్న నుంచి స్వామి వివేకానంద వరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నుంచి నేటి వరకు ఎంతోమంది సంస్కరణవాదులు హిందూ సమాజాన్ని మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు’’ అని ఆర్. అశోక వ్యాఖ్యానించారు.
Read Also- Navjyot Singh death: ఆర్థిక శాఖ సీనియర్ అధికారి మృతికి కారణమైన బీఎండబ్ల్యూ కార్ డ్రైవర్ అరెస్ట్
చరిత్రలో ముస్లింలు ఎప్పుడూ సంస్కరణవాదులైన వలీ శరీఫ్, లేదా డాక్టర్ అబ్దుల్ కలాం వంటి వ్యక్తులకన్నా, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లాంటి వారినే ఆదర్శంగా చూశారని అశోక ఆరోపించారు. ఇస్లామ్‌లో వేళ్లూనుకున్న మౌలికవాదం, జిహాదీ మనస్తత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు, సరిదిద్దే ప్రయత్నాలు కనిపించలేదని ఆయన ఆరోపించారు. సంస్కరణవాదుల మార్పులను ముస్లింలు ఎప్పుడూ అంగీకరించలేదని ఆయన విమర్శించారు. సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానించే వామపక్ష దృక్పథాన్ని పక్కనపెట్టి, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతయుత నాయకుడిగా మాట్లాడాలని సిద్ధరామయ్యపై అశోక మండిపడ్డారు.
Read Also- Adwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు
కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష నేత నారాయణస్వామి కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతి, మతాల ఆధారంగా ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులగణనలో దళిత క్రిస్టియన్, లింగాయత్ క్రిస్టియన్, వొక్కలిగ క్రిస్టియన్ వంటి ఆప్షన్లు ఇచ్చారని, ఇది పూర్తిగా అర్థరహితమైన చర్య అని మండిపడ్డారు. సోనియా గాంధీని సంతోషపెట్టేందుకు ఈ తరహాలో కులగణన చేపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సమానత్వం అనేది మతం కారణంగా కాదని, ప్రేమ, ఆత్మీయత, గౌరవాలతో లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఏ మతం అయినా సమానత్వాన్ని పూర్తిగా ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సర్వేలు నిర్వహించుకోవచ్చు, కానీ జనగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని బొమ్మై చెప్పారు.