Jangaon Politics (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jangaon Politics: జనగామ రాజ‌కీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!

Jangaon Politics: పోరాటాల పురిటి గడ్డ, రసవత్తర రాజకీయాలకు కేరాఫ్, విలక్షణ తీర్పుకు మారుపేరుగా నిలిచే జ‌న‌గామ గ‌డ్డ‌పై మరోమారు రాజ‌కీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల నేత‌ల మ‌ధ్య పిడుగులాంటి మాట‌ల యుద్దం ఒక వైపు రాష్ట్ర వ్యాప్తంగా చరచనీయంశంగా మారితే మరో పక్క ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నేతల తెరచాటు దోస్తాన్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అందరి ముందు హాట్ కామెంట్స్ చేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుకునే నేతలు తెర వెనుక కలుసుకోవడం.. కామన్ ప్రత్యర్థికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా తెర వెనుక ఏకం ఏకమై పోరాటం చేయడం, ప్ర‌త్య‌ర్థిని తిట్ట‌డం బ‌దులు పొగ‌డ‌డం, విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌కుండా గమ్మున ఉండడం ఇవన్నీ జనగామ జిల్లాలోని మూడు నియోజక వర్గంలో ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తుంది.

మూడు నియోజక వర్గాల్లో ముక్కోణపు రాజకీయం

జ‌న‌గామ జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు మూడు రకాల విచిత్రంగా సాగుతూ జిల్లా ప్రజలను గంద‌ర‌గోళంలో పడేస్తున్నాయి. ఒకరిది మాటల యుద్ధం అయితే మరొకరిది తెరచాటు దోస్తాన్, ఇంకొకరిది వాడి తగ్గిన రాజకీయం ఆసక్తి రేపుతున్నాయి. కార్య‌క‌ర్త‌లు గ్రామాల్లో పార్టీలుగా విడిపోయి ఘ‌ర్ష‌ణలు ప‌డుతుంటే, వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు సోష‌ల్ మీడియా(Social Media)లో తమ నేత‌ల‌కు అనుకూలంగా ప్రత్యర్థి నేతలకు వ్య‌తిరేక పోస్టుల‌తో ర‌చ్చ‌ర‌చ్చ చేస్తుంటే, నేత‌లు మాత్రం మాకు అవి వ‌ర్తించ‌వు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. ప్ర‌ధానంగా పలువురు బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నేత‌ల మ‌ద్య స‌ఖ్య‌త క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్ధులుగా పోటీ చేసిన‌ప్ప‌టికి ఇప్పుడు మాత్రం మాకు ఎవ్వ‌రు ప్ర‌త్య‌ర్ధులు కారు.. మేమంతా ఒక్క‌టే అనే సందేశం ఇస్తున్నారు. ఒకరి మెప్పు కోసం మరొకరు ఆరాట పడుతున్నారు. వీరి తీరు ఎవ్వరికీ అంతు చిక్క‌డం లేదు. అస‌లు ఏం జరుగుతుంది అనే గంద‌ర‌గోళంలో పార్టీల కార్య‌క‌ర్త‌లు పడ్డారు.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ముక్కోణం

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ముక్కోణపు రాజ‌కీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ కు బిఆర్ఎస్ తో పోరాటం ఒక వైపు ఉంటే మరోవైపు అంతర్గత వ‌ర్గ‌పోరు కొనసాగుతుంది. ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి(MLA Kadiam Srihari) బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఎన్నికల అనంతరం కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సింగ‌పురం ఇందిరకు కడియం శ్రీహరి కి మధ్య ఆదిప‌త్య‌పోరు సాగుతుంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ తాటికొండ రాజ‌య్య‌(Thatikonda Rajaiah)ను కాద‌ని బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ క‌డియం శ్రీ‌హ‌రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే అప్ప‌టి ఎన్నిక‌ల్లో రాజ‌య్య వ‌ర్గం క‌డియం శ్రీ‌హ‌రికి స‌హ‌క‌రించ‌కుండా ఓడించేందుకు ప్ర‌య‌త్నించింద‌నే అప‌వాదు ఉంది. రాజ‌య్య మాదిగ సామాజిక వ‌ర్గంకు చెందినవారికి టికెట్ ఇవ్వ‌కుండా బైండ్ల సామాజిక వర్గానికి చిందిన వ్యక్తికి టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల బ‌హిరంగంగానే రాజయ్య విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌య్య మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్య‌ర్థి సింగ‌పురం ఇందిర‌కు అంత‌ర్గ‌త మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. దీంతో మొద‌టి నుంచి రాజ‌య్య‌, క‌డియం శ్రీ‌హరి ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్ధులే. ఒక్క పార్టీలో ఉన్నా ఇద్ద‌రు తూర్పు ప‌డ‌మ‌ర లాగానే ఉన్నారు.

Also Read: New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ

రాజకీయ వర్గాల్లో సర్వత్ర చర్చ

దీనికి తోడు ఎన్నిక‌ల్లో ఇందిర‌కు రాజ‌య్య మ‌ద్ద‌తు ఇచ్చాడ‌నే కోపంతో క‌డియం శ్రీ‌హ‌రి ఉన్నారు. ఇక రాజ‌య్య గ‌త ఎన్నిక‌ల నుంచే సింగ‌పురం ఇందిర‌కు ప‌రోక్షంగా స‌హాక‌రించిన‌ట్లు ప్ర‌చారంలో ఉన్న నేప‌థ్యంలో ఇందిర‌ వర్గంతో తెరవెనుక కలిసి క‌డియం ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు రాజకీయ వర్గాల్లో సర్వత్ర చర్చ సాగుతుంది. శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అన్న‌చందంగా క‌డియం శ్రీ‌హ‌రికి ఇందిర‌కు స‌ఖ్య‌త లేని దృష్ట్యా ఇందిర‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటే భ‌విష్య‌త్‌లో త‌న‌కు మేలు క‌లుగుతుంద‌ని రాజ‌య్య రాజ‌కీయ ఎత్తులు వేస్తున్న‌ట్లు వినికిడి. అందుకే క‌డియం శ్రీ‌హ‌రి ఇందిర ప‌ల్లెం లాక్కున్నాడ‌ని ఆమేకు స‌పోర్టుగా రాజ‌య్య మాట్లాడారనే చర్చ సాగుతుంది. అదే విధంగా మాదిగ సామాజిక వ‌ర్గం మాది, ఇక్క‌డ మాదిగ‌లే ఎక్కువ‌గా ఉన్నారు అని ప్ర‌తిసారి రాజ‌య్య మాదిగ కులాన్ని అడ్డుగా పెట్టుకుని ఇందిర‌ను ప్ర‌స‌న్నం చేసుకునే విధంగా మాట్లాడుతున్నాడ‌ని, ఇందిర రాబోవు ఎన్నిక‌ల్లో రాజ‌య్య‌కు మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్ధ‌మ‌తువుంది.

జ‌న‌గామ‌లో ప‌ల్లాతో కొమ్మూరి

జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇరుపార్టీల నేత‌లు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి డాక్ట‌ర్ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పోటీ చేసి, కాంగ్రెస్ అభ్య‌ర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి(Kommuri Pratap Reddy)పై గెలిచారు. దీంతో ఇరువురు కొంత‌కాలం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఇప్పుడు సీన్ మారింది. ఇటీవ‌ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. దీంతో ప్ర‌త్య‌ర్థి అయిన కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి ప‌ల్లా ఇంటికి వెళ్ళి ప‌రామ‌ర్శించారు. ఇక ప‌ల్లా కోలుకుని ఇటీవ‌ల జ‌న‌గామ‌కు వ‌చ్చారు. వైధ్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా(Damodar Raja Narasimha) జ‌న‌గామ‌లో ప‌లు అభివృద్ది ప‌నుల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ల్లా, కొమ్మూరి ప‌క్క‌ప‌క్క‌నే నిల‌బ‌డి ఒక‌రిని ఒక‌రు ప‌ల‌క‌రించుకుంటూ క‌నిపించారు. అయితే కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి పూర్వాశ్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్య‌క్తే. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేగా చేర్యాల నుంచి గెలిచారు. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు. ప‌ల్లా కూడా కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడే. రాబోవు రోజుల్లో చేర్యాల నియోజ‌క‌వ‌ర్గంగా మ‌ళ్ళీ అవుతుంద‌నే ప్ర‌చారం ఉంది. దీంతో కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి ఇప్ప‌టి నుంచే రాజ‌కీయంగా త‌న‌కు అందివ‌చ్చే అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ఉన్నార‌ని, ప‌ల్లాతో స‌న్నిహితంగా ఉంటే రెండు వైపులా లాభం ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వినికిడి. అందుకే ఇద్ద‌రు ఎప్పుడు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం లేద‌ని ఇరు పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Also Read: Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

పాల‌కుర్తిలో త‌గ్గిన విమ‌ర్శ‌ల వాడి

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు(Errabelli Dayakar Rao) అనూహ్యంగా ఓడిపోయారు. వరంగల్(Warangal) తలపండిన రాజకియ నాయకుడుగా ఉన్న దయాకర్ రావు రాజకీయాలకు అప్పుడే పరిచయం అవుతున్న అతి పిన్న వయస్కురాలైన యువతి చేతిలో ఓటమి చవి చూశారు. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి గెలిచింది మామిడాల య‌శ‌స్వినిరెడ్డి(Yashaswini Reddy). కానీ వెనుకుండి న‌డిపించిన నేత హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి(Hanumandla Jhansi Reddy). అమెరికా పౌరురాలైన ఝాన్సీరెడ్డి కుటుంబంతో ఎర్ర‌బెల్లికి ముందు నుంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వీరి మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఝాన్సీ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయడం అడ్డుకునేందుకు దయాకర్ రావు విశ్వ ప్రయత్నాలు చేయడం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఆ ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్ధులుగా మారారు. ద‌యాక‌ర్‌రావును ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఝాన్సీరెడ్డి మొద‌టి నుంచి పావులు క‌దిపారు. అందుకు అనుగుణంగానే అనున్న‌ది సాధించారు. కానీ రోజులు మారిన‌ట్లే ఇద్ద‌రి ఆలోచ‌న‌ల్లో మార్పులు వ‌చ్చాయి.

ద‌యాక‌ర్‌రావు మాట‌తీరులోనూ మార్పు

మొద‌ట్లో ఇద్ద‌రు పేరుపెట్టుకుని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకున్న నేతలు ఇప్పుడు అస‌లు ఒకరి పేరు ఒక‌రు చెప్ప‌కుండా, ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా గమ్మున ఉంటున్నారని చర్చ సాగుతుంది. సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఝాన్సీరెడ్డి ద‌య‌కర్‌రావు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు బాగా చేయించాడ‌ని కితాబు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగా అభివృధ్ధి చేశాడ‌నే ధోర‌ణిలో మాట్లాడ‌టం విశేషం. ఇక ద‌యాక‌ర్‌రావు మాట‌తీరులోనూ మార్పు వ‌చ్చింది. సీఎం రేవంత్‌రెడ్డిని, ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నాడే త‌ప్ప ఎమ్మెల్యే య‌శ‌స్వినిరెడ్డిని, ఝాన్సీరెడ్డిని ప‌ల్లేత్తు మాట అన‌డం లేదు. రాబోవు రోజుల్లో ద‌యాక‌ర్‌రావు పాల‌కుర్తి నుంచి పోటీ చేయ‌కుండా కొత్త‌గా వ‌ర్ధ‌న్న‌పేట జ‌న‌ర‌ల్ సీటు అయితే అక్క‌డికి వెళ్ళిపోతాడ‌నే కార‌ణ‌మా లేక పాత స్నేహాల‌ను గుర్తు చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డ‌మా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌ర్ధ‌న్న‌పేట‌కు ద‌యాక‌ర్‌రావు వెళితే ఇక త‌మ‌కు తిరుగుండ‌దు క‌నుక ఆయ‌న‌ను విమ‌ర్శిస్తే లాభ‌మేంటి అనే ఆలోచ‌న‌తో ఝాన్సీరెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read; Huzurabad Floods: అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలనీలు జలమయం

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!