New Train Service: ఈశాన్య భారత రాష్ట్రమైన మిజోరం రాజధాని ఐజ్వాల్ – పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మధ్య దశాబ్దాల కలగా ఉన్న రైల్వే లైన్ (New Train Service) అందుబాటులోకి వచ్చింది. బైరాబి–సైరాంగ్ రైల్వే లైన్ సెప్టెంబర్ 13న సాకారం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఐజ్వాల్ పర్యటనకు వెళ్లి సైరాంగ్–కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. పచ్చజెండా ఊపి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. దీంతో, ఐజ్వాల్ నుంచి కొలకతాకు రైలు ప్రయాణం కల సాధ్యమవబోతోంది. రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో మిజోరం–పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అంతేకాదు, రైలు ప్రయాణించే మార్గంలో పర్యాటకం అభివృద్ధి చెందడానికి దోహదపడనుందని అంచనాగా ఉంది.
ట్రైన్ వివరాలు ఇవే
బైరాబి-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ 13125 / 13126గా రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 1,530 కిలోమీటర్లు. ఒకవైపు ప్రయాణానికి ఏకంగా 31 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ప్రధానంగా నైహాటి, కృష్ణానగర్ సిటీ, ముర్షిదాబాద్ వంటి స్టేషన్ల మీదుగా వెళుతుంది. ఈ రైలు నిర్వహణను ఈస్ట్రన్ రైల్వే (ER) జోన్ చూసుకుంటుంది.
Read Also- GHMC – Hydra: హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించనున్న జీహెచ్ఎంసీ!
ఏయే స్టేషన్లలో ఆగుతుంది?
కోల్‌కతా – ఐజ్వాల్ (సైరాంగ్) స్టేషన్ల మధ్య మొత్తం 24 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ప్యాసింజర్లకు ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని కల్పించే విధంగా స్టేషన్లను ఎంపిక చేశారు. రైలు ఆగే స్టేషన్ల జాబితాలో నైహాటి, కృష్ణనగర్ సిటీ, బెరహంపూర్ కోర్టు, ముర్షిదాబాద్, అజీంఘంజ్, జంగీపూర్ రోడ్, న్యూ ఫరక్కా, మాల్డా టౌన్, కిషన్‌గంజ్, న్యూ కూచ్ బెహార్, తుఫాంగంజ్, గోలక్‌గంజ్, గౌరిపూర్, బిలాసిపారా, అభయపురి అస్సాం, గౌల్పారా టౌన్, కామాఖ్యా, న్యూ జల్పాయిగురి (ఎన్‌జేపీ), గువహటి, హోజాయ్, న్యూ హాఫ్‌లాంగ్, బడార్పూర్ జంక్షన్, హైలాకాండి, బైరబీ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో దిగేవారు ఇతర మార్గాల్లో ప్రయాణానికి కొత్త రూట్ల సౌలభ్యాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా, ఈశాన్య భారత రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచుతాయి.
రైలు సర్వీసు ఎప్పుడెప్పుడు?
కోల్‌కతా నుంచి సైరాంగ్‌కు వారానికి మూడు సార్లు ఎక్స్‌ప్రెస్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఆదివారం, బుధవారం, గురువారం ఈ సర్వీసు ఉంటుంది. ఇక, సైరాంగ్ నుంచి కోల్‌కతాకు సోమవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో నడుస్తుంది. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. 2 ఏసీ-2 టయర్ కోచ్‌లు, 5 ఏసీ-3 టయర్ కోచ్‌లు, 2 ఏసీ 3-టయర్ ఎకానమీ, 7 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్, బ్రేక్, 1 లగేజ్-జనరేటర్ కార్, 1 ఎస్ఎల్ఆర్‌డీ ఉంటాయి.
Read Also- Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం
టైమ్ టేబుల్ విషయానికి వస్తే, ట్రైన్ నెంబర్ 13125 (కోల్‌కతా నుంచి సైరాంగ్‌కి) కోల్‌కతా నుంచి ఉదయం 12:25 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7:45 గంటలకు (19:45) గమ్యస్థానం చేరుకుంటుంది. ఇక, ట్రైన్ నెంబర్ 13126 (సైరాంగ్ నుంచి కోల్‌కతా) సైరాంగ్ నుంచి ఉదయం 07:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు (14:30) గమ్యస్థానం చేరుతుంది. ఇరువైపులా జర్నీకి 31 గంటల సమయం పడుతుంది.