GHMC – Hydra:హైడ్రాకు సూపర్ చెక్ పవర్
బల్దియా పూడికతీత పనులపై క్రాస్ చెక్
అవినీతి జరగకుండా బిల్లుల చెల్లింపులు
హైడ్రా క్లియరెన్స్ ఇస్తేనే బిల్లులు చెల్లించనున్న జీహెచ్ఎంసీ
బిల్లుల క్లియరెన్స్‌లపై విజిలెన్స్ అధ్యయనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ ఏడాది పొడువునా చేపట్టే నాలాల్లోని పూడికతీత పనుల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా, పనులు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా మున్సిపల్ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. గతంలో కేవలం వర్షాకాలానికి ముందే నిర్వహించే పూడికతీత పనులను మున్ముందు ఏడాది పొడవునా నిరంతరంగా చేపట్టాలని భావిస్తున్నారు. కానీ, ఈ పనుల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు సైతం చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేయని పనులకు బిల్లులను క్లెయిమ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు సైతం లేకపోలేదు.
Read Also- Electrocution Tragedy: రైలు పైకెక్కి నిలబడ్డాడు.. హైటెన్షన్ వైర్లు తాకి మాడి మసై పోయాడు
ఈ క్రమంలో పూడికతీత పనులు నూటికి నూరు శాతం పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు నడుంబిగించారు. ఈ క్రమంలో వానాకాలం సహాయక చర్యలతో పాటు నాలాల్లోని పూడికతీత పనులు నిర్వహించే బాధ్యతల్ని ఇప్పటికే హైడ్రాకు మున్సిపల్ శాఖ బదలాయించినా, ఒక వైపు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ కూడా ఏడాది పొడువునా నిరంతరం పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పనులు పూర్తి చేశామని చెప్పుకుంటూ బిల్లులు క్లెయిమ్ చేసుకునే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంపై అసలు పనులు జరిగాయా? లేదా? ఒక వేళ జరిగితే ఎంత శాతం పనులు జరిగాయి? కాంట్రాక్టరు ఎంత శాతం పూర్తయ్యాయని చెప్పారు? అన్న విషయాలపై సూపర్ చెక్ చేసే అధికారాన్ని మున్సిపల్ శాఖ హైడ్రాకు (GHMC – Hydra) కేటాయించనుంది.
Read Also- Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం
మొత్తం పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి హైడ్రా ఇచ్చే క్లియరెన్స్ ఆధారంగానే బిల్లుల చెల్లించాలని జీహెచ్ఎంసీని మున్సిపల్ శాఖ ఆదేశించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాయని చెబుతున్నా, నాలా ఎంత పొడువున పూడికతీత పనులు చేపట్టారు? ఎంత పొడువున పనులు పూర్తయ్యాయి?, నాలా నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ల పూడికను వెలికి తీశారు? అన్న విషయాలపై సమగ్రంగా స్టడీ చేసి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలా? లేదా? ఒక వేళ పనులు జరిగాయని భావిస్తే, ఎంత శాతం జరిగాయి? మొత్తం పని విలువలో కాంట్రాక్టర్‌కు ఎంత శాతం పనులకు బిల్లులు చెల్లించాలన్న విషయంపై హైడ్రా చాలా క్లారిటీగా క్లియరెన్స్‌లో పేర్కొనేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తీసిన పూడికను తరలించిన వాహనాల నెంబర్లను కూడా క్లియరెన్స్‌లో హైడ్రా పొందుపర్చేలా ఈ అధ్యయనం ఉంటుందని సమాచారం.
హైడ్రా క్లియరెన్స్ లలో పారదర్శకత ఎంత?
పూడికతీత పనులపై బిల్లులు చెల్లించే ముందు పనులెంత వరకు జరిగాయన్న విషయాన్ని స్టడీ చేసి, హైడ్రా సమర్పించే క్లియరెన్స్‌లలో పారదర్శకతను విజిలెన్స్ అంచనా వేయనున్నట్లు ఆదేశించే అవకాశముంది. ఎట్టి పరిస్థితుల్లో వెచ్చిస్తున్న నిధులకు తగిన విధంగా పనులు జరగాలన్న ఉద్దేశ్యంలో కేవలం హైడ్రా ఇచ్చే క్లియరెన్స్‌ను ప్రామాణికంగా తీసుకోకుండా మరింత పారదర్శకత కోసం ఆ క్లియరెన్స్‌ను విజిలెన్స్ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించేలా మున్సిపల్ శాఖ సూపర్ చెక్ ఆదేశాలివ్వనున్నట్లు తెలిసింది. ఒక వేళ హైడ్రా క్లియరెన్స్‌లోనూ లోపాలుంటే విజిలెన్స్ వింగ్ హైడ్రాను కూడా జవాబుదారీగా చేసే అవకాశముంటుంది. ఒక వేళ హైడ్రా క్లియరెన్స్‌లో కాంట్రాక్టర్ చెప్పిన శాతం మేరకు పనులు కాకపోతే కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.