Revanth Reddy: శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి.
Revanth Reddy ( IMAGE credit: swetcha reporter)
Telangana News

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Revanth Reddy: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. 2027లో జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

  Also Read:Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం! 

74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలి 

మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముందని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు సీఎంకు వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలన్నారు.

శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలి

మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని ఆదేశించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు గోదావరి తీరం వెంట ఉన్న అన్ని ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనుభవమున్న ఏజెన్సీలు, కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలోమంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి పాల్గొన్నారు.

 Also Read:  Anushka Shetty: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. గుడ్ బై ? షాక్ లో ఫ్యాన్స్

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!