Firecrackers: దేశంలో అనుసరిస్తున్న టపాసుల విధానంపై (Firecrackers Policy) సుప్రీంకోర్టు శుక్రవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. టపాసులపై నిషేధాన్ని ఒక్క ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించింది. దేశంలోని మిగతా నగరాల్లో కూడా తీవ్రమైన వాయు కాలుష్యం ఉన్నప్పటికీ అక్కడ ఎందుకు నిషేధం విధించకూడదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా టపాసులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన వాతావరణం ఢిల్లీ-రాజధాని ప్రాంత ప్రజల హక్కైతే, మిగతా నగరాల ప్రజలకు ఈ హక్కు ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించారు. టపాసులపై నియంత్రణకు సంబంధించిన నిబంధనలు దేశవ్యాప్తంగా వర్తించాలని, కేవలం ఢిల్లీకి ప్రత్యేకంగా నిబంధనలు ఎందుకు? అని ఆయన అన్నారు.
Read Also- Revanth Reddy: మన ప్రజా పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గత శీతాకాలంలో తాను అమృత్‌సర్‌లో ఉన్నానని, అప్పుడు ఢిల్లీ కంటే అక్కడే ఎక్కువ కాలుష్యం ఉన్నట్టు అనిపించిందని జస్టిస్ ఏఆర్ గవాయ్ ప్రస్తావించారు. టపాసులపై నిషేధం ఉంటే, దేశవ్యాప్తంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చీఫ్ జస్టిస్ చేసిన ఈ వ్యాఖ్యలను సీనియర్ అడ్వకేట్ అపరాజితా సింగ్ సమర్థించారు. ఎలైట్ వర్గాల వారు (సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావశీల వ్యక్తులు) తమ గురించి మాత్రమే చూసుకుంటారని, కాలుష్యం ఉన్నప్పుడు వాళ్లు ఢిల్లీలో ఉండరని, బయటకి వెళ్తారని అపరాజితా సింగ్ విమర్శించారు. కాగా, దేశవ్యాప్తంగా టపాసులపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ వాయు నాణ్యత నియంత్రణ కమిషన్‌కు (CAQM) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
దీపావళి పండుగకు కొన్ని వారాల ముందు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీపావళి పండుగ సాధారణంగా అక్టోబర్-నవంబర్ నెలల్లో వస్తుంటుంది. భారీగా టపాసులు కాల్చుతుండడంతో వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిపోతోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్ద సవాలుగా నిలుస్తోంది. అందుకే, దీపావళికి ముందు అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also- India vs Pakistan: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై పంజాబ్ కింగ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
పటాకులు కాల్చడంతో పాటు పంట వ్యర్థాలు కూడా తగలబెడుతుండడం వాయు నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు గతంలో కూడా దీపావళికి ముందు టపాసులపై నిషేధాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ-రాజధాని ప్రాంతంలోనైతే సంపూర్ణ నిషేధం అమలులో ఉంది. ఎన్‌సీఆర్ శివారు ప్రాంతాలలో క్రాకర్స్ కాల్చేందుకు పరిమిత సమయాలు ఉన్నాయి. అంతేకాదు, టపాసుల విక్రయం, నిల్వపై కఠిన ఆంక్షలు ఉన్నాయి.
టపాసులపై ఇటీవల నిషేధం విధిస్తూ జారీ అయిన ఆదేశాలను గమనిస్తే, 2024 డిసెంబర్ 19న ఢిల్లీ ప్రభుత్వం ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది. క్రాకర్స్ తయారీ, నిల్వ, అమ్మకం, కాల్చడంపై ఏడాదిపాటు నిషేధం విధించింది. 2025 జనవరి 17న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో ఎన్‌సీఆర్ విస్తరించి ఉండే ప్రాంతాలలో కూడా నిషేధాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వాతావరణంపై ప్రభావం చూపని గ్రీన్ క్రాకర్స్‌పై సడలింపు ఇచ్చేందుకు నిరాకరించింది. నిషేధాన్ని నిర్దిష్ట నెలలకే పరిమితం చేయలేమని చెప్పింది.