HCA Scam: తవ్వినాకొద్దీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. మౌళిక సదుపాయాలు కల్పించండి.. ప్రతిభగల క్రికెటర్లను గుర్తించి వారిని సాన పెట్టండని యేటా బీసీసీఐ ఇస్తూ వచ్చి నిధులను జగన్మోహన్ రావు(Jaganmohan Rao) అండ్ కంపెనీ అడ్డంగా బుక్కేశారు. అనర్హత వేటు పడ్డ క్రికెట్ క్లబ్బులకు నిధులు కేటాయించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ క్లబ్బుల పేర లక్షల రూపాయలను జగన్మోహన్ రావు అతని సహచరులే స్వాహా చేసినట్టుగా సీఐడీ విచారణలో తేలటం.
క్రికెట్ కోసం..
క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ(BCCI) గుర్తింపు పొందిన ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ప్రతీ సంవత్సరం భారీగా నిధులను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏకు కూడా ఏటా 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ వచ్చింది. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ నిధులతో క్రికెట్ స్టేడియంలను ఏర్పాటు చేయటం…ఔత్సాహిక క్రికెటర్లు ఆడుకునేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించటం వంటి పనులు చేయాలి. అయితే, జగన్మోహన్ రావు అధ్యక్షునిగా వచ్చిన తరువాత స్టేడియంల ఏర్పాటు మాట అటుంచి కనీసం ఉన్నవాటి పాత గేట్లను కూడా మార్చలేదు. అయితే, ఆడిట్ రిపోర్టుల్లో మాత్రం క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామంటూ లెక్కలు చూపించి ప్రతీ సంవత్సరం వచ్చిన వంద కోట్ల నుంచి సగానికి పైగా స్వాహా చేశారు.
ప్రతిభకు గుర్తింపే ఇవ్వలేదు..
మన దేశంలో క్రికెట్ ఒక మతం. కోట్లాది మందికి ఈ ఆటపై ఉన్న మక్కువ మరే ఆటపై లేదు. కాస్త ఊహ తెలిసిన చిన్నపిల్లల నుంచి యువకుల వరకు వందలో తొంభై శాతం మంది క్రికెట్ అంటే ఇష్ట పడతారు. తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ వారిలా తయారవ్వాలని కలలుగనే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించే దిశగా హెచ్‌సీఏ కృషి చేయాలి. దీని కోసం వారి వారి వయసును బట్టి వేర్వేరు గ్రూపులుగా విభజించి మ్యాచులు నిర్వహించాలి. వీటిలో సత్తా చాటిన వారిని ప్రోత్సహించాలి. అయితే, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గమనించాల్సిన అంశం ఏమిటంటే వయసు వారీగా గ్రూపులనే తయారు చేయలేదు. పోటీలు జరపలేదు. కేవలం రికార్డుల్లో మాత్రమే పోటీలు జరిగాయి. వాటికి ఖర్చులయ్యాయంటూ జగన్మోహన్ రావు అండ్ కంపెనీ లక్షల రూపాయలను కొల్లగొట్టింది.
సెలెక్ట్ చేస్తే మాకేంటి..?
ఇక, లీగ్ టీంకు ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్లు డబ్బు సమర్పించుకోవాల్సిందే. వందలు.. వేలు కాదు లక్షల్లో దక్షిణలు ఇవ్వాల్సిందే. క్రికెట్ ఆడటంలో ప్రతిభ ఉందా? అన్నది అవసరమే లేదు. ఎవరు డబ్బులిస్తే వాళ్లే టీంలో ఉంటారు. హెచ్‌సీఏ(HCA) అక్రమాలపై సీఐడీ(CID) జరిపిన విచారణలో ఈ అంశం కూడా వెలుగు చూసింది. జగన్మోహన్ రావు(Jaganmohan Rao) అతని సహచరులు కలిసి ఆటగాళ్లను సెలెక్ట్ చేసేందుకు వారి వారి తల్లిదండ్రుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Sony LIV 2025 Originals: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. అన్నీ ఒకే చోట.. చూడాలంటే?
కాగితాలపై క్లబ్బులు.. జేబుల్లోకి డబ్బులు..
ఇక, బీసీసీఐ నుంచి ఏటా వచ్చే నిధులను ఆట అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయాలి. దీని కోసం క్రికెట్ క్లబ్బులకు నిధులు ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహించాలి. అయితే, జగన్మోహన్ రావు అధ్యక్షునిగా కొనసాగినన్ని రోజులు దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహారం నడిచింది. కాగితాలకే పరిమితమైన కొన్ని క్లబ్బులకు లక్షలు మంజూరు చేసినట్టుగా రికార్డుల్లో చూపించి ఆ డబ్బును కూడా స్వాహా చేశారు. మరో అంశం ఏమిటంటే ఒకే సొసైటీ కింద నమోదైన రెండేసి క్లబ్బులకు కూడా జగన్మోహన్ రావు, ఆయన సహచరులు నిధులను పప్పుబెల్లాల్లా పంచి పెట్టటం. దీనికి నిదర్శనందా అమీర్ పేట క్రికెట్ క్లబ్(Ameerpet Cricket Club) ను పేర్కొనవచ్చు. ఈ క్లబ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ సర్ధార్ దల్జీత్ సింగ్ తన కుటుంబ సభ్యుల పేర ఖాల్సా క్రికెట్ క్లబ్ పేర మరో దుకాణాన్ని కూడా నడిపించారు. క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని కమర్షియల్ టాక్స్ శాఖలో పని చేసి రిటైరైన బసవరాజుకు అమీర్ పేట క్రికెట్ క్లబ్బు కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. దీని ఆధారంగా బసవరాజు ఏకంగా హెచ్‌సీఏ సెక్రటరీగా ఎన్నిక కావటం గమనార్హం.
నిలదీస్తే..
నిజంగా నాణ్యమైన క్రీడాకారులను తయారు చేయటానికి పని చేస్తున్న క్రికెట్ క్లబ్బుల నిర్వాహకులు దీనిపై నిలదీస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా రెండు మూడు లక్షల రూపాయలు విదిలిస్తూ వచ్చారు. అదే సమయంలో తాము చెప్పినట్టుగా నడుచుకునే క్లబ్బుల నిర్వాహకులకు మాత్రం పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా ముట్టజెప్పినట్టు సమాచారం. ఇలా ఇచ్చిన డబ్బు నుంచి జగన్మోహన్ రావు అండ్ కంపెనీ తమ వాటా తాము తీసుకున్నట్టుగా కూడా దర్యాప్తులో తేలిందని ఓ సీఐడీ అధికారి తెలిపారు.
సస్పెన్షన్ వేటు పడ్డ..
హెచ్‌సీఏ పరిపాలనా పునర్ వ్యవస్థీకరణ కోసం నియమించిన జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నిబంధనలు పాటించని 57 క్లబ్బులపై గతంలో సస్పెన్షన్ వేటు వేశారు. దీని ప్రకారం ఆయా క్లబ్బులకు ఎలాంటి నిధులు ఇవ్వటానికి వీల్లేదు. ఆ క్లబ్బులకు చెందిన వారు ఏజీఎం సమావేశాల్లో కూడా పాల్గొనరాదు. అయితే, జగన్మోహన్ రావు అధ్యక్షునిగా, ఆయన సహచరులు కార్యవర్గంలోకి రాగానే ఈ 57 క్లబ్బులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఏజీఎం సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. తద్వారా జగన్మోహన్ రావు అతని బృందం తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అడ్డూ అదుపు లేకుండా అవినీతిని కొనసాగించింది.
Also Read: Husband Suicide: ‘నా భార్య వేధిస్తోంది.. భరించలేకపోతున్నా’.. అంటూ భర్త సూసైడ్