Husband Suicide: ఉత్తర్ ప్రదేశ్ లోని విషాదం చోటుచేసుకుంది. భార్య, అత్త మామల వేధింపులు భరించలేక 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం తాగే ముందు బాధితుడు తన బాధలు, భార్యతో తలెత్తిన విభేదాల గురించి మూడు వీడియోలు రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రం సింగ్ (Ayush Vikram Singh) తెలిపిన వివరాల ప్రకారం.. జాన్ మహ్మద్ (Jaan Mohammad) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అత్తమామలతో తలెత్తిన వివాదాల్లో చిక్కుకొని జాన్ మహ్మద్ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. వారితో నిత్యం గొడవల కారణంగానే ఆయన ఈ అతి దారుణమైన నిర్ణయం తీసుకున్నారని అనుమానిస్తున్నాం. ఆయన మరణానికి ముందు రికార్డు చేసిన వీడియోలను పరిశీలిస్తున్నాం’ అని సింగ్ చెప్పారు.
భార్య, బంధువులపై కేసు నమోదు
బాధితుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు భార్య షెహ్నాజ్, అత్త అహ్మద్ నిషా, మరిది ఇస్రార్ సహా పలువురు బంధువులపై మానసిక, శారీరక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
‘ఇంటి కోసం వేధించారు’
మృతుడి సోదరుడు ఆస్ మహ్మద్ (Aas Mohammad) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుడి భార్య షెహ్నాజ్ గత రెండు వారాలుగా పుట్టింటిలో ఉంటూ ఇల్లు తన పేరు మీదకు మార్చాలని ఒత్తిడి చేసిందని చెప్పారు. 3 నెలల క్రితం ఇదే విషయమై ఆమె ఆత్మహత్యకు సైతం యత్నించిందని పేర్కొన్నారు. షెహ్నాజ్, ఆమె కుటుంబ సభ్యులు తరుచూగా జాన్ అహ్మద్ పై తప్పుడు కేసులు పెట్టించి మానసికంగా వేధించారని పేర్కొన్నారు. దీని వల్ల తన సోదరుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని ఆస్ మహ్మద్ వివరించాడు.
Also Read: Congress: మణిపూర్‌లో ప్రధాని పర్యటన.. లాజిక్ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్
సూసైడ్ వీడియోలో ఏముందంటే?
మృతుడు జాన్ అహ్మద్.. మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్యకు జబ్బు చేస్తే ఇల్లు తాకట్టు పెట్టి చికిత్స చేయించినట్లు చెప్పాడు. తన టెంపో కూడా అమ్మేశానని పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరణం తర్వాత తన ఇల్లు నలుగురు కుమార్తెలకు దక్కేలా చూడాలని అధికారులను వేడుకున్నాడు. ఇది తన చివరి కోరిక అని స్పష్టం చేశాడు.