Narendra Modi: తన తల్లి హీరాబెన్ మోదీపై దూషణల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శల దాడి చేశారు. ‘‘నేను శివుడి భక్తుడిని. దూషణల విషాన్ని కూడా తాగగలను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మొత్తం కాంగ్రెస్ వ్యవస్థలన్నీ నన్నే లక్ష్యంగా చేసుకుంటాయని నాకు తెలుసు. మోదీ మళ్లీ ఏడుస్తున్నారని అంటాయి. కానీ, ప్రజలే నా దేవుళ్లు. నేను నా బాధను వాళ్ల ముందు కాకపోతే ఇంకెవరి ముందు వ్యక్తపరచాలి?. ప్రజలే నా యజమానులు, జనాలే నా ‘రిమోట్ కంట్రోల్’. నాకు మరో రిమోట్ కంట్రోల్ అంటూ ఏమీ లేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అస్సాం రాష్ట్రం దరంగ్‌లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ-కాంగ్రెస్ ఉమ్మడిగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తనపై వ్యక్తిగత దూషణల పట్ల మోదీ ఈ విధంగా స్పందించారు. అయితే, ఆ వ్యాఖ్యల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవరూ ఆ వేదికపై లేరని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే, ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఏఐ వీడియోపై మరో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి మోదీ ‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయాలను నాటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నియంత్రించేవారనే ఉద్దేశంతో మోదీ ఈ పదాన్ని వాడారనే విశ్లేషణలు వినపడుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా గాంధీ కుటుంబ సభ్యులు రిమోట్ కంట్రోల్ చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఖర్గేపై విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఒక వ్యాఖ్యను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తనకు చూపించారని మోదీ చెప్పారు. అస్సాం దిగ్గజ గాయకుడు భూపెన్ హజారికాకు భారత రత్న ప్రకటించిన తర్వాత, సింగర్లు, డ్యాన్సర్లకు కూడా అవార్డులు ఇస్తున్నారంటూ ఖర్గే అన్నారని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనకు చూపించారని మోదీ చెప్పారు. ఈ దేశానికి గొప్ప బిడ్డ అయిన భూపెన్ హజారికాకు భారత రత్న ప్రకటించిన రోజు ఇది జరిగిందన్నారు.
భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1962లో భారత-చైనా యుద్ధం తర్వాత ‘ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు ఇంకా మానలేదని’ అన్నారంటూ ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఆ గాయాలపై నేటి తరం కాంగ్రెస్ పార్టీ మరింత ఉప్పు చల్లి ఇంకాస్త బాధ పెడుతోందని విమర్శించారు. అస్సాం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు పరిపాలించిందని, కానీ, 60–65 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందని మోదీ విమర్శించారు. అయితే, రాష్ట్ర ప్రజలు తమను ఓట్లతో ఆశీర్వదించిన తర్వాత, తాము కేవలం పదేళ్లలోనే 6 కొత్త వంతెనలు నిర్మించగలిగామని మోదీ గుర్తుచేశారు. కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆశీర్వాదించడం సహజమేనని మోదీ చెప్పారు.