Raids on Adulterated Food Units: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఎస్‌ఓటీ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లక్షల రూపాయల విలువైన కల్తీ నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, పసుపు, ధనియాల పొడి, ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ సుధీర్ బాబు (Commissioner Sudheer Babu) తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ ఆహార పదార్థాల తయారీ యూనిట్లు నడుపుతున్నారనే సమాచారం మేరకు బుధవారం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కల్తీ ఉత్పత్తులను ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేరుతో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
Also Read: GHMC Commissioner Karnan: ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి జీహెచ్ఎంసీ అధికారులు!
3,037 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి
ఎల్బీనగర్ జోన్ పరిధిలో 11 నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేసి 575 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. (Maheshwaram Zone) మహేశ్వరం జోన్ పరిధిలో 8 అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి 3,946 కిలోల పేస్ట్‌ను సీజ్ చేశారు. మల్కాజిగిరి జోన్ పరిధిలో 9 కేంద్రాలపై దాడులు చేసి 3,037 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు రూ.10 లక్షల విలువైన ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, మాత్రలను సీజ్ చేశారు. బోనగిరిలోని 18 కేంద్రాలపై దాడులు చేసి 35 కిలోల కల్తీ పన్నీర్, 250 కిలోల మిక్చర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నాసీరకం వస్తువులు
వీటితో పాటు కల్తీ పాలు, పసుపు, ధనియాల పౌడర్, స్వీట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీంలు, మినరల్ వాటర్, బేకరీ పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులు ఎలాంటి లైసెన్సులు లేకుండా, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, నాసీరకం వస్తువులతో వీటిని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో మొత్తం 46 కేసులు నమోదు చేసి 52 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. కేసుల్లో విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ గురించి తెలిస్తే 87126 62666 నంబర్‌కు వాట్సాప్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
Also Read: MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!