Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళనకు కమిషనర్ వీ.సీ. సజ్జనార్(VC Sajanar) శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా టాస్క్ఫోర్స్లోనే పని చేస్తున్న ఎస్ఐ స్థాయి అధికారులు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు మొత్తం 137మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్త సిబ్బంది రానున్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ నూతన ఉత్తేజంతో పని చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. నిజానికి 1982కు ముందు హైదరాబాద్(Hyderabad)లో శాంతిభద్రతల పరిరక్షణకు యాంటీ గూండా స్క్వాడ్ ఉండేది. అయితే, పున్నయ్య కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన తరువాత దీనిని టాస్క్ఫోర్స్గా మార్చారు.
గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు..
నేరాలకు పాల్పడే వారికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు డీసీపీ జోన్ల వారీగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. సంచలనం సృష్టించిన హత్యలు, దోపిడీలు, బందిపోటు దోపిడీలు, ఎక్స్‌టార్షన్లు, కిడ్నాపులు, భూ కబ్జాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలను అరికట్టటం టాస్క్ ఫోర్స్ ప్రధాన విధులు. దాంతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రౌడీషీటర్లు, కమ్యూనల్ రౌడీషీటర్లు, గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారు, వారి సానుభూతిపరులపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. గతంలో ఈ దిశగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పుకోదగ్గ విజయాలనే సాధించారు. అయితే, రాను రాను టాస్క్‌ఫోర్స్ బృందాల పని తీరు నామమాత్రంగా మారిపోయింది. సంచలనం సృస్టించిన కేసులను వదిలేసి కల్తీ సరుకులు, నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నవారిని పట్టుకోవడం, గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేయడానికే పరిమితమయ్యాయి.
Also Read: Kotak Bank Downtime: కోటక్ ఖాతాదారులకు కీలక అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పనిచేయవు.. ఎప్పుడంటే?
కొందరు అసాంఘిక శక్తుల ఆట
సంచలనం సృష్టించిన కేసుల్లో వీరి పాత్ర పెద్దగా లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం టాస్క్‌ఫోర్స్(Task Force) బృందాల్లో పని చేస్తున్న కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడిగా అక్కడే ఉండిపోవటమేనని పోలీసు వర్గాలే అంటున్నాయి. వీరిలో కొందరు అసాంఘిక శక్తుల ఆట కట్టించాల్సింది పోయి వారితో జత కట్టటమే అని పేర్కొన్నాయి. కరడుగట్టిన ఏ రౌడీషీటర్ మొబైల్ ఫోన్‌ను చెక్ చేసినా టాస్క్ ఫోర్స్ సిబ్బంది నెంబర్లు ఖచ్చితంగా దొరుకుతాయని వ్యాఖ్యానించాయి. ఇలా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పని చేయాల్సిన సిబ్బందిపై సంపాదనలకు అలవాటు పడి అక్రమార్కులకు అండగా ఉంటుండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ సజ్జనార్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నారని కొందరు అధికారులు చెప్పడం గమనార్హం.

