GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీ (GHMC)లోకి ఇటీవలే 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో అనివార్యమైన వార్డుల డీలిమిటేషన్ పై ఎట్టకేలకు జీహెచ్ఎంసీ (GHMC) స్టడీ ముగిసింది. కొత్తగా 2 వేల 50 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిని మొత్తం 300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేయాలన్న కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించటంతో తొలుత ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అందుకు అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచాలని ఆదేశించిన కోర్టు ఇపుడు అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగిసినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పటంతో డీలిమిటేషన్ ప్రక్రియకు లీగల్ గా ఎదురైన అడ్డంకులన్నీ తొలగినట్టేనని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
నామకరణం చేసేందుకు అధికారులు సిద్దం
డీలిమిటేషన్ కు సంబంధించి ఈ నెల 9వ తేదీన డ్రాఫ్ట్ ను జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మరుసటి రోజు నుంచే ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించారు. తొలి రోజైన ఈ నెల 10వ తేదీన కేవలం 40 అభ్యంతరాలను సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయాల్లో స్వీకరించిన జీహెచ్ఎంసీ అధికారులు కోర్టు పెంచిన గడువు వరకు మొత్తం దాదాపు 10 వేల అభ్యంతరాలను, సలహాలను స్వీకరించారు. వీటిని డిస్పోజ్ చేసేందుకు అయిదు అధికారులతో జోన్ల వారీగా నియమించిన కమిటీలు ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో పలు మార్పులు చేసినట్లు సమాచారం.
Also Read: GHMC Ward Delimitation: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పై సర్వత్రా ఉత్కంఠ.. నేడే ఆఖరు తేదీ
80 వార్డుల పేర్లను మార్చేందుకు అధికారులు సిద్దం
ముఖ్యంగా విలీనానిక ముందే జీహెచ్ఎంసీ పరిధిలోనున్న 150 వార్డుల్లో చాలా వరకు వార్డులను రెండుగా పునర్విభజించినట్లు, కొత్తగా ఏర్పడిన వార్డులకు పెట్టిన పేర్లపై కూడా అభ్యంతరాలు రావటంతో, వాటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు సుమారు 70 నుంచి 80 వార్డుల పేర్లను మార్చేందుకు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సూచించిన విధంగానే నామకరణం చేసేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం. పునర్విభజించిన వార్డుకు డీడీ కాలనీగా అధికారులు పేరు పెట్టగా, ప్రజాప్రతినిధుల అభ్యంతరం మేరకు దాని పేరును బాగ్ అంబర్ పేటగా, సికిందరాబాద్ జోన్ లో మరో వార్డుకు మోండా మార్కెట్ గా సుమారు 80 వార్డుల పేర్లను మార్చేందుకు అధికారులు సిద్దమునట్లు సమాచారం.
సరిహద్దులు, జనాభా వ్యత్యాసానికి సంబంధించి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను కూడా ఫీజుబిలిటిని బట్టి డిస్పోజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన స్టడీ సోమవారం సాయంత్రానికి ముగిసినట్లు సమాచారం. ముఖ్యంగా సరిహద్దులతో సంబంధించి ఒక మున్సిపల్ వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాకుండా అధికారులు క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ, బీహెచ్ఈఎల్ జరిగిన ఇలాంటి పొరపాటును సరి చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో సవరణలు చేసినట్లు సమాచారం.
సర్కారుకు చేసిన జీహెచ్ఎంసీ నివేదిక?
డీలిమిటేషన్ పై పలువురు కోర్టును ఆశ్రయించటంతో కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అభ్యంతరాలను, సలహాలను ప్రత్యేకంగా పరిశీలిస్తూ డీస్పోజ్ చేస్తున్న తరుణంలో పునర్విభజనకు డెడ్ లైన్ గా పెట్టుకున్న డిసెంబర్ 31 సమీపిస్తున్నందున, ఇంకా అభ్యంతరాలపై తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేయటంతో వార్డుల డీలిమిటేషన్ కు దాదాపు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. ఫైనల్ నోటిఫికేషన్ జారీ మినహా అన్ని రకాలుగా 300 మున్సిపల్ వార్డులకు లైన్ క్లియర్ అయినట్టే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ ప్రిలిమినరీ నోటిఫికేషన్, దానిపై స్వీకరించిన అభ్యంతరాలు, సలహాలు, కోర్టు ఆదేశాలు, అభ్యంతరాలు, సలహాలను పరిగణలోకి తీసుకుని చేసిన మార్పులతో కూడిన నివేదికను జీహెచ్ఎంసీ సోమవారం సాయంత్రమే సర్కారుకు పంపినట్లు సమాచారం.
ఇక రిజర్వేషన్లపై ఫోకస్
ప్రస్తుతం సర్కారు చేరిన మార్పులు, చేర్పులతో కూడిన డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషను సర్కారు ఆమోదించినానంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రక్రియ మొత్తం వార్డుల రిజర్వేషన్ పైనే కొనసాగనున్నట్లు సమాచారం. రానున్న ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగియనుండటంతో ఆ తర్వాతే రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో వార్డులోని జనాభాలో అత్యధికంగా ఉన్న సామాజిక వర్గాన్ని గుర్తించి, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Also Read: GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!

